
నకిలీ సర్టిఫికేటుగాళ్లు..!
గుర్తింపు లేని సంస్థల్లో గుట్టుగా సౌందర్య కోర్సులు
సాక్షి, సిటీబ్యూరో: వైద్యారోగ్య శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. నగరంలో ఎలాంటి అర్హత లేని సంస్థలు విచ్చలవిడిగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా గత కొన్నేళ్లుగా ఈ అక్రమ దందా నడిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదులు అందడం, తనిఖీల్లో నకిలీ సర్టిఫికెట్లు లభించడంతో కథ అడ్డం తిరిగింది. నగరంలో మూడు సంస్థలు ఎలాంటి అర్హత లేకుండా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో సదరు సంస్థలపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నారు.
● జాతీయ మెడికల్ కౌన్సిల్‌లో గుర్తింపు లేని యూనివర్సిటీలు సంస్థలు సర్టిఫికెట్లు జారీ చేయరాదని, అలా చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని కౌన్సిల్ చెబుతోంది. నగరంలో మాత్రం ఈ నిబంధనలు తమకు వర్తించవన్నట్లు ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేని సంస్థలు ఏస్తటిక్స్, బ్యూటీ, కాస్మొటాలజీ రంగంలో విచ్చలవిడిగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. దీంతో కాస్మొటాలజీ కేంద్రాల్లో వైద్యులుగా చెలామణీ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డెంటల్ వైద్యులు, ఇతరులు సైతం స్కిన్ కేర్, హెయిర్, ఇతర సౌందర్య చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నిలదీసినపుడు మేం బ్యూటీ కోర్సులు పూర్తి చేశామని పలువురు సర్టిఫికెట్లు చూపించినట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్లు చెల్లవనే విషయమై ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఆయా సర్టిఫికెట్లు జారీ చేసిన సంస్థలకు ఎన్‌ఎంసీ గుర్తింపు ఉందా? లేదా? అని ఆరా తీశారు. అసలు సర్టిఫికెట్లు నకిలీవా, ఒరిజినలా అనే కోణంలోనూ విచారణ చేపట్టగా గుర్తింపు లేని సంస్థలు అక్రమార్జనే ధ్యేయంగా సాగిస్తున్న అక్రమ దందాగా గుర్తించారు. దీంతో నగరంలోని మూడు సంస్థలపై కేసులు నమోదు చేశారు. అక్రమ పద్దతుల్లో కాస్మొటాలజీ చికిత్సలు అందిస్తున్న సుమారు 30 మందిపై కేసులు నమోదు చేశారు.
ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావు
జాతీయ మెడికల్ కౌన్సిల్‌లో గుర్తింపు పొందిన సంస్థల్లో మాత్రమే కోర్సులు పూర్తి చేయాలి. గుర్తింపు లేని సంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కా వు. ఇలాంటి సర్టిఫికెట్లతో ప్రాక్టీస్ చేసే వారిపై ఎన్‌ఎంసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఎంబీబీఎస్, ఫాం డీ, బీడీఎస్, బీఎస్సీ, హోమియో చేసిన వారు సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కాస్మొటాలజీ సేవలందిస్తున్న 30 మందిపై కేసులు నమోదయ్యాయి. అనధికారిక స ంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్లతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, పీలింగ్, ఏస్తటిక్ సర్జరీలు చేస్తున్నారు. ఇటువంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం.
– శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు
నగరంలో వందలాది మందికి సర్టిఫికెట్ల జారీ
మూడు సంస్థలకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు
30 మందికి పైగా కేసులు నమోదు