
పనిచేసుకోనివ్వడం లేదు.. వీఆర్‌ఎస్ ఇవ్వండి
హుడాకాంప్లెక్స్: ‘ఉన్నతాధికారులు నన్ను పనిచేసుకోనివ్వడం లేదు. నాకు వీఆర్‌ఎస్ ఇవ్వండి’ అని బిల్ కలెక్టర్ శ్రీశైలం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు విన్నవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ సర్కిల్ నం.5లో బిల్ కలెక్టర్‌గా శ్రీశైలం బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతనికి రెండేళ్లలో నాలుగు డాకెట్లు అప్పగించారు. ప్రస్తుతం 321 డాకెట్ ఇచ్చారు. ఇంకా అతను తీసుకోలేదు. శ్రీశైలం.. కమిషనర్ కర్ణన్‌కు అందజేసిన ఫిర్యాదులో ఉన్నతాధికారులు నెలనెలా హాస్టల్స్, విద్యాసంస్థల ఇనిస్టిట్యూషన్లు, ప్రైవేటు కార్యాలయాలు, కమర్షియల్ కాంప్లెక్సులు తదితరుల వద్ద నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారని, తనను తనిఖీలకు వెళ్లవద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పన్నులు వసూలు చేయనియ్యడం లేదని, లైసెన్సు నోటీసు బుక్కు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు ఇవ్వబోతే.. డిప్యూటీ కమిషనర్,ఏఎంసీ, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్లకు నచ్చడం లేదని పేర్కొంటూ.. శనివారంకమిషనర్ వినతిపత్రంఅందజేశాడు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవన్నీ చూపిస్తానని చెప్పారు. ఒకవేళ తాను తప్పు చేస్తే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని, ఈ టార్చర్ భరించడం తన వల్ల కాదని వాపోయారు. సంబంధిత కాపీని ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్ సెల్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని వర్కింగ్ యూనియన్లకు, విలేకర్లకు పంపానని, బిల్డింగ్ ఫొటోస్, నోటీసు అక్‌నాలెడ్జ్‌మెంట్ కాపీలు కూడా జతచేశానని వెల్లడించారు. ఇదే విషయమై డిప్యూటీ కమిషనర్‌ను వివరణ కోరగా.. అతని వలన కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ట్రేడర్స్, విద్యాసంస్థల యజమానులను దూషిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వేరే చోట పని చేసినప్పుడు కూడా శ్రీశైలం పనితీరు సరిగ్గా లేదని, ఇక్కడ అలాగే ప్రవర్తిస్తున్నందుకు మార్చాల్సి వచ్చిందని, మరే ఇతర కారణాలు లేవని వెల్లడించారు.
కమిషనర్‌కు.. బిల్ కలెక్టర్ విన్నపం