
మరో మహిళ మోజులో పడి..
రామంతాపూర్: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యా పిల్లలను ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్ వెంకటరెడ్డినగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలు లావణ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కటకం లావణ్యకు స్పెషల్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కటకం నాగరాజుతో 2009తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గత కొన్నాళ్లుగా నాగరాజు మరో మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తూ ఆమెతో కలిసి వెంకటరెడ్డినగర్‌లో ఉంటున్నాడు. ఈ విషయం తెలియడంతో లావణ్య ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం రాత్రి భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి అతడిని నిలదీయగా నాగరాజు ఆమెను బయటికి గెంటేసి తాళం వేసుకున్నాడు. దీంతో ఆమె శనివారం రాత్రి నుంచి అదే ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. దీనిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా గతంలో ఇదే విషయమై మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని చెప్పిన పోలీసులు తనను తిరిగి పంపారని తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను డిమాండ్ చేసింది.
భార్యా పిల్లలనుఇంటి నుంచి గెంటేసిన భర్త
ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి ఎదుట బాధితురాలి ఆందోళన