
పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్ల
16 తులాల బంగారు నగల అపహరణ
మొయినాబాద్: వివాహ వేడుకలో పాల్గొని వచ్చేసరికి గుర్తుతెలియని దుండగులు ఇంటిని గుల్ల చేశారు. ఇంటి తాళాలు, బీరువా తాళం పగులగొట్టి 16 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధర్రాతి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధి పెద్దమంగళారంకు చెందిన సీహెచ్ అనిత, శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి వనస్తలిపురంలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోని సామగ్రి చిందరవందరగా పడుంది. బీరువాలోని బంగారు నగలు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. క్లూస్‌టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: కుమారుడితో గృహిణి అదృశ్యం అయింది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఇస్తియాక్ అన్సారీ, నజీరా కాతూన్(25) దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి జీవనోపాధి నిమిత్తం జల్‌పల్లి వాదే ముస్తాఫా బస్తీకి వలస వచ్చారు. ఈ నెల 2న అందరితో కలిసి నిద్రపోయిన నజీరా.. ఉదయం లేచి చూసే సరికి నాలుగు నెలల కుమారుడు జీషాన్‌తో కలిసి కనిపించకుండా పోయింది. అదే రోజున భర్త అన్సారీ.. ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కానీ, 87126 62367 నంబర్‌కు కానీ సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.