
అదనపు కలెక్టర్‌గా చంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా అదనపు(రెవెన్యూ) కలెక్టర్‌గా కె.చంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీఓ జారీ చేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్‌డీగా పని చేస్తున్న చంద్రారెడ్డిని ప్రభుత్వం జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమించింది. గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్‌గాపని చేసిన ఎంవీ భూపాల్‌రెడ్డి ఏసీబీ కేసులో అరెస్ట్ కావడం, ఆ తర్వాత అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం, తాజాగా ఆమె మెటర్నిటీ లీవ్‌లో వెళ్లడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మూడు ఎకరాలు కేటాయింపు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా కొత్త భవన నిర్మాణం కోసం ప్రభుత్వం శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 91/2లో మూడు ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుతో పాటు శేరిలింగంపల్లి, గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇక్కడ సొంత భవనాలను నిర్మించనున్నారు. జులై 31న ‘సాక్షి’దినపత్రికలో ‘గూడు కట్టని నిర్లక్ష్యం..అద్దె భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు’శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. సొంత భవనాలు లేకపోవడం, ఇరుకై న అద్దె భవనాల్లో ఉద్యోగులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో మూడు ఎకరాల భూమిని కేటాయించింది. తక్షణమే ఈ భూమిని స్వాధీనం చేసుకుని, నిర్మాణ పనులు ప్రారంభించవచ్చునని ప్రకటించింది.
ఎరువుల కొరత
సృష్టిస్తే చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి ఉష
యాచారం: జిల్లాలో ఎరువుల కొరత లేదని, డిమాండ్‌ను బట్టి ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి ఉష హెచ్చరించారు. శనివారం ఆమె మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి ఎరువుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. ఇంత వరకు విక్రయించిన యూరియా, గ్రోమోర్ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. పత్తి, వరి పంటకు సరిపడా యూరియా, గ్రోమోర్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుని ఎరువులు వాడాలని సూచించారు. మోతాదుకు మించితే పంటకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఆమె వెంట ఇబ్రహీంపట్నం డివిజన్ ఏడీఏ సుజాత, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్ తదితరులు పాల్గొన్నారు.
పశువుల ఆరోగ్యంపై
శ్రద్ధ అవసరం
జిల్లా పశువైద్యాధికారి మధుసూదన్
షాబాద్: పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉంటూ సకాలంలో వైద్యం అందించాలని జిల్లా పశువైద్యాధికారి మధుసూదన్ అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని ఆస్పల్లిగూడ గ్రామంలోని విజయ్‌రెడ్డి డెయిరీని సందర్శించి, పాడి పరిశ్రమపై అవగాహన కల్పించారు. అనంతరం షాబాద్ పశువైద్యశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. పాడి రైతులు పశువులకు సకాలంలో వైద్యం అందిస్తేనే అధిక పాల దిగుబడి వస్తుందని చెప్పారు. మేలు రకం పశువుల ఎంపిక ద్వారా అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. పశుపోషణపై దృష్టి సారించి మేలురకం పశువులకు ఎంపిక చేసుకుని వాటికి నాణ్యమైన గడ్డి జాతులు, దాణా అందించడంతో మరింత లాభం పొందచవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో షాబాద్ పశువైద్యాధికారి స్రవంతి, రైతులు తదితరులున్నారు.

అదనపు కలెక్టర్‌గా చంద్రారెడ్డి