
ప్రమాదంలో దేశ సార్వభౌమత్వం
మొయినాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు సిద్ధమైన ఇండియాను యుద్ధం చేయకుండా నిలిపివేశానని అమెరికాలో ట్రంప్ ప్రకటిస్తే.. ఇక్కడ మోదీ విజయం సాధించడానికి తానే పాకిస్తాన్‌ను లొంగ తీసుకున్నానని ప్రకటన చేశారు.. ట్రంప్, మోదీల విరుద్ధ ప్రకటనలతో దేశ సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్‌లో సీపీఐ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 17వ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. భారతదేశ ఎగుమతులపై అమెరికా 25 శాతం సుంకం విధించినా ప్రధాని మోదీ నోరువిప్పడంలేదన్నారు. దేశ విదేశాంగ విధానం ప్రపంచంలోని ఏ దేశాల మీద ఆధారపడి ఉండదని.. కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాంగ విధానానికి భంగం కలిగే విధానాలను అమలు చేస్తోందన్నారు. అమెరికా ప్రభుత్వం భారత దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తుంటే ప్రధాని మోదీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపి.. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారనే సాకుతో బీసీ బిల్లుపై కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందన్నారు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతో ఎన్‌కౌంటర్లు చేస్తుందని. 2026 మార్చి వరకు మావోయిస్టులు లేని భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రకటించడం బాధాకరమన్నారు. కమ్యూనిస్టులు లేకపోతే బూర్జువా వర్గాలు ప్రజల ఆస్తిని, ప్రాణాలను పూర్తిగా హరిస్తాయన్నారు. కమ్యూనిజాన్ని, మార్క్సిజాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదన్నారు. కమ్యూనిస్టుల విలువ ప్రజలకు తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నరసింహ, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు నర్సింగ్‌రావు, రామస్వామి, నరసింహ, యాదయ్య, జంగయ్య పాల్గొన్నారు
ట్రంప్, మోదీ విరుద్ధ ప్రకటనలతో గందరగోళం
బీసీ బిల్లుపై కేంద్రం నాన్చుడు ధోరణి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మొయినాబాద్‌లో సీపీఐ జిల్లా 17వ మహాసభలు