
లక్ష్యాన్ని చేరుకోకుంటే చర్యలు
షాద్‌నగర్‌రూరల్: వన మహోత్సవంలో అధికారులు ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందేనని.. లేదంటే చర్యలు తప్పవని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలలోని హాజిపల్లి భాస్కర గార్డెన్‌లో డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు వన మహోత్సవం, పారిశుద్ధ్యం, పోలింగ్ బూత్‌లలో కనీస సౌకర్యాల ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులుతో సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు అడిగిన ప్రశ్నలకు మండల అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటేందుకు కావాల్సిన గుంతలను తీయలేదని, కనీసం ఎన్ని మొక్కలు నాటాలి, ఎక్కడెక్కడ నాటాలి అనే విషయాలు తెలియకుండా ఏ విధంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం తాము పని చేస్తున్న గ్రామానికి సంబంధించిన వైశాల్యం, పాపులేషన్ పంచాయతీ కార్యదర్శులకు తెలియడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివరి వరకు ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కృషి చేయాలని, లేని యెడల ఉన్నతాధికారుల ఆదేశాలతో సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృషిలో పెట్టుకుని పోలింగ్ బూత్‌లలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం డీపీఓ సురేష్‌మోహన్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని అన్నారు. తాగునీటి ట్యాంకులు, రోడ్లు, మురుగు కాలువలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంతల్లో నీటి నిల్వ, పెంట కుప్పలు, మట్టి దిబ్బలు, పిచ్చి మొక్కలు, మురుగునీరు ఉండకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంకుడుగుంతల నిర్మాణం పనులను త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఆడిట్ తప్పనిసరిగా మండల పరిషత్ కార్యాలయాలలోనే నిర్వహించాలని అన్నారు. సెక్రటరీలు తమ రోజువారి హాజరును నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికే జిల్లాలో ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేశామన్నారు.
15 మంది సెక్రటరీలకు షోకాజ్‌లు
వన మహోత్సవంలో భాగంగా పది శాతం కన్నా తక్కువ పనులను చేపట్టిన 15 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీలను జారీ చేయాలని ఆదేశించారు. కొత్తూరు మండలం సిద్దాపూర్, మల్లాపూర్, శేరిగూడ భద్రాయపల్లి, కేశంపేట మండలం సుందరాపూర్, దత్తాయపల్లి, చింతకుంటపల్లి, కొందుర్గు మండలం తంగళ్లపల్లి, బైరంపల్లి, మహదేవ్‌పూర్, జిల్లేడ్‌చౌదరిగూడ మండలం చింతకుంటతండా, జాకారం, ఇంద్రానగర్, వనంపల్లి, మల్కాపూర్, పద్మారం పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీలు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి
మీరు పనిచేసే గ్రామ వైశాల్యం, జనాభా తెలియదా?
పంచాయతీ కార్యదర్శులపై అధికారుల ఆగ్రహం