
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
చేవెళ్ల: రాష్ట్రంలోని పెన్షన్‌దారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందని పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్‌లో దివ్యాంగుల మహాగర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంద కృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక పెన్షన్‌ను రూ.4వేలకు, దివ్యాంగులకు రూ.6వేలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చి అమలులో విఫలమైందన్నారు. హామీలు అమలు చేయలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కొత్త పింఛన్‌ల కోసం అర్హులు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగా గత ప్రభుత్వాలు పెన్షన్‌లు పెంచాయని, ఆరోగ్య శ్రీ పథకం అమలు చేశాయని గుర్తు చేశారు. పెన్షన్‌దారుల కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న మహాగర్జన నిర్వహించేందుకు నిర్ణయించిందన్నారు. అప్పటి వరకు ప్రభుత్వం దిగిరావాలని.. లేదంటే మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాదిగ, రాష్ట్ర, జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నాయకులు ఎం.యాదగిరి, ప్రవీణ్‌కుమార్, శంకర్‌రావు, పెంటయ్య, నర్సింలు, వెంకటయ్య, డీఎం.చందు, భాను ప్రసాద్, మహేందర్, నర్సింహ, బాబు, నాయకులు, పెన్షన్‌దారులు పాల్గొన్నారు.
మహాగర్జన సన్నాహక సమావేశంలోఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కృష్ణమాదిగ