
రుణ వితరణ లక్ష్యం చేరాలి
బ్యాంకర్ల సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అంకితభావంతో పని చేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బ్యాంకు నియంత్రణ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట రుణ లక్ష్యాన్ని పూర్తి చేయడం, రుణ వితరణ లక్ష్యాన్ని అధిగమించడంలో కొన్ని బ్యాంకులు లక్ష్యాలను ఎందుకు చేరుకోవడం లేదో తెలియజేయాలని కోరారు. ఆయా రంగాలలోని అనేక బ్యాంకులు లక్ష్యాల ప్రకారం రుణాలు అందిస్తున్నప్పటికీ, కొన్ని బ్యాంకులు వెనుకబడ్డాయని తెలిపారు. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి టార్గెట్ సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ఉన్నత విద్య, గృహ నిర్మాణాల కోసం అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పలు వర్గాల ఆర్థిక పురోగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల కింద అర్హులైన వారికి లోన్లు మంజూరు చేసి మద్దతు అందించాలని తెలిపారు. వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలు త్వరగా మంజూరు చేయాలని, తద్వారా వారు వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి ఆర్థిక సాయం అందించవచ్చని వివరించారు. ఇందిరా మహిళా శక్తి సంఘాలకు అవసరమైన రుణాలు అందించాలని, ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది వికలాంగులు ఉన్న గ్రూపులకు బ్యాంకు ఖాతాలు తెరిచి రుణ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కింద ఎంపికై న లబ్ధిదారులకు వ్యవసాయ, పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఇతర శాఖల సమన్వయంతో స్వయం ఉపాధికి ఆర్థిక మద్దతు ఇవ్వాలన్నారు. రుణగ్రహీతలు యూనిట్లు స్థాపించారా.. లేదా..? నిశితంగా పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను పూర్తిగా పంపిణీ చేయాలని మరియు సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం తగదని సూచించారు. ఎల్‌డీఎం సుశీల్ కుమార్, ఆర్‌బీఐ రెహమాన్, నాబార్డ్ ఏజీఎం అఖిల్, వ్యవసాయ శాఖ అధికారి ఉష, ఉద్యాన శాఖ అధికారి సురేశ్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నవీన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి, బ్యాంకు నియంత్రణ అధికారులు పాల్గొన్నారు.