
కటకటాలకు పాత నేరస్తుడు
మూడు నెలల క్రితం చోరీకి పాల్పడిన దొంగను పట్టుకున్న పోలీసులు
మొయినాబాద్: పలు ప్రాంతాల్లో వరుసగా చోరీలు చేస్తూ మూడు నెలల కిత్రం మండలంలోని పెద్దమంగళారంలో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను మొయినాబాద్ పోలీసులు పట్టుకున్నారు. దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన తిమ్మగళ్ల మురళి అలియాస్ ముత్యాలు అత్తాపూర్‌లో ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. మే నెల 5న రాత్రి 10 గంటల సమయంలో బస్సులో మొయినాబాద్‌కు వచ్చాడు. క్వాటర్ బాటిల్ మద్యం కొనుక్కుని ఒక్కడే కూర్చొని తాగాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పెద్దమంగళారం గ్రామానికి వెళ్లి తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేశాడు. తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. బీరువాలోని 26 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు దోచుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు సుమారు మూడు నెలలకు బుధవారం దొంగను పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గత మార్చి నుంచి మైలార్‌దేవ్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మరో ఆరు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. దొంగిలించిన సొత్తును అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
27 దొంగతనం కేసులు
పెద్దమంగళారంలో దొంగతనం చేసి పట్టుపడిన మురళి పాత నేరస్తుడు. అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 27 దొంగతనం కేసులున్నాయి. మురళి ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దొంగతనానికి వెళ్లే ముందు ఒక్కడే మద్యం తాగి వెళ్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని తన వెంట తెచ్చుకునే ఇనుపరాడ్డుతో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతారు. దొంగిలించిన ఆభరణాలను విక్రయించి డబ్బులను ఖర్చులకు వాడుకుంటాడు. ఇలా సైబరాబాద్, వరంగల్, సంగారెడ్డి, కడప, కర్నూలు జిల్లాలో దొంగతనాలు చేసి చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.