
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ దుర్మరణం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైరపాట ఆంజనేయులు(30) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా బుధవారం లింగధన గ్రామం నుంచి ట్రాక్టర్‌తో జూలపల్లి వస్తుండగా గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన వెంకటేష్ కుమారుడు శివకుమార్(30) భార్య మాధవి ఈ నెల 7న ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి శివకుమార్ మనోవేదనతో ఉన్నాడు. ఈ నెల 29న డ్యూటీకి వెళ్లిన అతడు మధ్యాహ్నం బంధువుకు ఫోన్ చేసి ‘అమ్మ, నాన్న జాగ్రత్త.. తమ్ముడికి గైడెన్స్ ఇవ్వు’ అంటూ కాల్ చేసి అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. అతని ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం వెంకటేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ దుర్మరణం