
గూడు కట్టని నిర్లక్ష్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ప్రతినెలా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. సరూర్‌నగర్, కొడంగల్ మినహా మిగిలిన ఎస్‌ఆర్‌ఓ ఆఫీసులన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ముందే స్లాట్ బుక్ చేసుకుని ఆఫీసుకు చేరుకున్న విక్రయ, కొనుగోలుదారులతో పాటు సాక్ష్యులుగా వచ్చిన వారికి కనీస సదుపాయాలు కల్పించలేని దుస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలతో పాటు కంప్యూటర్లు తరచూ మొరాయిస్తుండటంతో ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు కనీసం 20 నిమిషాల సమయం పడుతోంది. ఇంతసేపు కూర్చునేందుకు కనీసం కుర్చీలు కూడా లేవు. గాలి, వెలుతురు లేని గదుల్లో కనీసం తాగునీరు సైతం లేకపోవడంతో సమీపంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా లేకపోవడంతో మహిళలు, యువతులు అవస్థలు పడుతున్నారు. కనీస వసతులు లేని ఇరుకై న భవనాలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.10 లక్షల వరకు అద్దె చెల్లిస్తుండటం గమనార్హం. ఇరుకై న జిల్లా భవనానికి ప్రతి నెలా రూ.1.30 లక్షల చొప్పున, ఇతర ప్రాంతాల్లోని ఒక్కో భవనానికి నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల చొప్పున అద్దె సమర్పించుకుంటున్నారు. నిజానికి జిల్లాలో ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద నిధులకూ కొరత లేదు. కానీ అధికారులు, పాలకుల కారణంగా వీటికి సొంత భవనాల కల నెరవేరడం లేదు.
నిత్యం వందలాది రిజిస్ట్రేషన్లు
జిల్లాలో మొత్తం 22 సబ్ రిజిస్ట్రార్ కేంద్రాలున్నాయి. వీటిలో నిత్యం వాణిజ్య, గృహ, వ్యవసాయేతర ఖాళీ భూముల, మ్యారేజీ, సొసైటీలు, చిట్‌ఫండ్స్ రిజిస్ట్రేషన్లు, జీపీఏ, రెక్టిఫికేషన్, లీజుకు సంబంధించి వందలాది అగ్రిమెంట్లు చేస్తారు. ఒక్కో ఎస్‌ఆర్‌ఓలో రోజుకు సగటున 50 నుంచి 60 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి ఒక్కో డాక్యుమెంట్‌పై రూ.వేలల్లో సమకూరుతోంది.
ఆంతర్యం ఏమిటో..?
జిల్లాల పునర్విభజనలో భాగంగా గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలుగా విభజించింది. పరిపాలన సౌలభ్యం కోసం ఆ తర్వాత జిల్లాల వారీగా సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. రెవెన్యూ సహా ఇతర శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. కానీ కీలకమైన రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఇప్పటికీ మేడ్చల్ జిల్లా(బాలానగర్) పరిధిలోనే కొనసాగిస్తుండటం వెనక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. చేవెళ్ల, షాద్‌నగర్, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం ప్రజలు నగరంలోని ట్రాఫిక్ వలయాన్ని దాటుకుని ఇక్కడికి చేరేందుకు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
అద్దె భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
జిల్లాలోని 22 ఎస్‌ఆర్‌ఓలలో రెండింటికే సొంత ఆఫీసులు
గాలి, వెలుతురు లేని ఇరుకై న భవనాల్లోనే రిజిస్ట్రేషన్లు
అధికారుల క్యాబిన్ల నిండా గుట్టలుగా పేరుకుపోయిన దస్త్రాలు
రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నా కనీస సదుపాయాలు కరువే
ఎక్కడ చూసినా ఫైళ్ల గుట్టలు
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎటూ చూసినా దుమ్ముధూళి పేరుకుపోయిన ఫైళ్ల గుట్టలే కనిపిస్తున్నాయి. ఉద్యోగులు కూర్చునే క్యాబిన్లతో పాటు కారిడార్లలోనూ రికార్డుల మూటలే దర్శనమిస్తున్నాయి. ఎవరైనా బాధితులు సంబంధిత అధికారి టేబుల్ వద్దకు చేరుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. వచ్చిన వ్యక్తి కనీసం నిలబడేందుకు కూడా ఆయా క్యాబిన్లలో చోటు లేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదా ఏదైనా ఇతర కారణాలతో అగ్గి రాజుకుంటే.. దస్త్రాల్లోని ప్రజల ఆస్తులన్నీ బుగ్గిపాలు కావాల్సిందే.

గూడు కట్టని నిర్లక్ష్యం