
సన్నాహాల దారిలో..
త్వరలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓఆర్‌ఆర్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు ఫ్యూచర్‌సిటీ మీదుగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సన్నాహాలు చేపట్టింది. రెండు దశల్లో పూర్తిచేయనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ సంస్థ టెండర్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు రూ.1665 కోట్లతో చేపట్టనున్న 19.20 కి.మీ. రోడ్డును రిత్విక్ సంస్థకు అప్పగించారు. మొదటి దశలో రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణకు ప్రభుత్వం రూ.246 కోట్లు కేటాయించింది. రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్ నుంచి ఆమన్‌గల్ వరకు 22.3 కి.మీ మేర నిర్మించనున్నారు. రూ.2,365 కోట్లతో చేపట్టనున్న రెండో దశ పనులను ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుంది. రెండో దశ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.345 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.4030 కోట్లతో 41 కిలోమీటర్లకు పైగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ రూ.591 కోట్లతో మొత్తం 1003.61 ఎకరాల భూములను సేకరించనుంది. ఇందులో సుమారు 202 ఎకరాలు టీజీఐఐసీకి చెందినవి కాగా, మరో 231.72 ఎకరాల అటవీ భూములు కూడా ఉన్నాయి. భూముల సేకరణ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులను గతంలోనే ఇచ్చింది.
హైదరాబాద్ ‘ఫ్యూచర్’కు మణిహారం..
హైదరాబాద్ మహా నగర విస్తరణలో భాగంగా ఫ్యూచర్‌సిటీ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుతో ఆర్ధికాభివృద్ధి పరుగులు పెట్టనుందని ప్రభుత్వం భావిస్తోంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రధాన రహదారుల మధ్య నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఎంతో కీలకం కానుంది. టౌన్‌షిప్‌లు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్ హబ్స్ తదితర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు సీమ్‌లెస్ జర్నీ సదుపాయాన్ని అందజేయనుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్‌ను గ్రీన్‌ఫీల్డ్ మార్గంలోనే చేపట్టనున్నారు. ఇతర రూట్లలో ఎలివేటెడ్ కారిడార్‌లుగా నిర్మించనుండగా. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో మెట్రోరైల్ కారిడార్ భూమిపైనే నిర్మించనున్నారు. పర్యావరణహితమైన ఫ్యూచర్‌సిటీ విస్తరణకు ఈ మార్గం దోహదం చేయనుంది. టెండర్లను దక్కించుకున్న సంస్థలకు త్వరలో వర్క్ ఆర్డర్‌లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
రెండు దశల్లో నిర్మించనున్న హెచ్‌ఎండీఏ
మొదటి దశలో రావిర్యాల– మీర్‌ఖాన్‌పేట్
రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్– ఆమన్‌గల్ వరకు
మహా నగరాభివృద్ధిలో ఎంతో కీలకం

సన్నాహాల దారిలో..