
ఐదో అంతస్తు నుంచి జారిపడి..
శంకర్‌పల్లి: మనం ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచిందంటారు. అచ్చం అలాంటి సంఘటనే మంగళవారం శంకర్‌పల్లిలో చోటు చేసుకుంది. తన ఒక్కగానొక్క అల్లుడిని మంచి స్థాయిలో చూద్దామని కలలుగన్న మామకు దుఃఖమే మిగిలింది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలపూర్‌కి చెందిన రాజు భవన నిర్మాణ కాంట్రాక్టర్. ఆయనకి ఒక్కగానొక్క కుమార్తె సంగీత ఉంది. ఆమెని 2021లో చౌడపూర్ మండలం లింగంపల్లి తండాకి చెందిన నేనావత్ సంతోష్(33)కి ఇచ్చి వివాహం చేయగా.. వారికి రెండేళ్ల పాప ఉంది. మొదటి నుంచి సంతోష్ ఫార్మసీ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తక్కువ జీతానికి పని చేస్తున్నాడని, తనని మంచి స్థాయిలో నిలపెడుదామని సంతోష్ మామ నిర్ణయించుకున్నాడు. తన కన్‌స్ట్రక్షన్ విభాగంలోకి రెండు నెలల క్రితమే తీసుకొచ్చి సూపర్‌వైజర్‌గా చేశాడు. మంగళవారం సంతోష్ భవనం 5వ అంతస్తులో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడి నుంచి మెటీరియల్ తీసుకొచ్చే యంత్రాన్ని గమనిస్తూ కిందికి చూశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడి కింద పడ్డాడు. స్థానికులు వెంటనే పక్కనే ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లుడిని ఉన్నత స్థాయిలో చూద్దామని ఆశపడిన మామకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సీఐ స్పష్టం చేశారు.
వ్యక్తి దుర్మరణం
మెటీరియల్ యంత్రాన్ని గమనిస్తుండగా ప్రమాదం