సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి | - | Sakshi
Sakshi News home page

సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి

Jun 2 2025 7:38 AM | Updated on Jun 2 2025 7:38 AM

సంచిన

సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి

వృద్ధురాలి మెడలో మంగళసూత్రం అపహరణ

ఇబ్రహీంపట్నం: కూరగాయల కోసమొచ్చిన వృద్ధురాలి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని ఓ దుండగుడు అపహరించుకొని పరారైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(65) ఇబ్రహీంపట్నంలోని మార్కెట్‌కు ఆదివారం ఉదయం వచ్చింది. అక్కడ కూరగాయలు తీసుకొని తలపై పెట్టుకొని వెళుతుంది. ముఖానికి మంకి క్యాప్‌ ధరించిన దుండగుడు నడుచుకుంటూ వచ్చి ఆమె తలపై సంచిని కిందపడేసి మెడలోని నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. దీంతో వృద్ధురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. స్థానిక ఏసీపీ కేపీవీ రాజు, సీఐ జగదీశ్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

కంటోన్మెంట్‌ బోర్డులో ఉద్యోగాల పేరుతో టోకరా

నిందితుడి అరెస్టు

రాంగోపాల్‌పేట్‌: కంటోన్మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సుధీంద్ర కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్‌పల్లి బాపూజీనగర్‌కు చెందిన శ్రవణ్‌కుమార్‌ అమాయకులను ఎంచుకుని కంటోన్మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. 2009 నుంచి 2024 వరకు బేగంపేట, తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 6 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీలేఖ అనే మహిళ నుంచి రూ.22వేలు తీసుకుని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు. పవన్‌ అనే వ్యక్తి నుంచి రూ.35వేలు, విశాల్‌ అనే వ్యక్తి నుంచి రూ.20వేలు, మరో వ్యక్తి నుంచి రూ.35వేలు, వేములవాడకు చెందిన కృష్ణ అనే వ్యక్తి నుంచి రూ.50వేలు తీసుకుని కంటోన్మెంట్‌ బోర్డులో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు డిఫెన్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీసులు అప్పగించారు.

ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

సనత్‌నగర్‌: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మల్లిపెద్ది వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి భార్య, కుమార్తెతో కలిసి కూకట్‌పల్లిలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 30న ఇంటి నుంచి బయటికి వెళ్లిన అతను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. చింతల్‌లో ఉంటున్న అతడి బావ రాజశేఖర్‌రెడ్డికి గాలింపు చేపట్టగా వెంకట్‌రెడ్డి భరత్‌నగర్‌లోని ఓయో లివింగ్‌ ట్రీ రూమ్‌ నెంబర్‌ 301లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయమై మృతుడి తండ్రి మల్లారెడ్డికి సమాచారం అందించడంతో ఆయన సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్‌ రెడ్డి ఇటీవలే ఇల్లు కొనుగోలు చేశాడని, అప్పుల భారం ఎక్కువ కావడంతో మనస్తాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇందిరమ్మ కమిటీ తీరుపై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

శంషాబాద్‌: శంషాబాద్‌ పట్టణంలోని తొండుపల్లి ఇందిరమ్మ కమిటీ తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు బాత్కు నర్సింహా యాదవ్‌, జిల్లా కార్యదర్శి పరమేష్‌ మాట్లాడుతూ... పదో వార్డులోని ఇందిరమ్మ కమటీని స్థానిక మాజీ కౌన్సిలర్‌ తనయుడు అస్తవ్యస్తంగా మార్చారని ఆరోపించారు. ఆయనతో పాటు మిగతా సభ్యులు కూడా బీఆర్‌ఎస్‌ నేతలేనన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసే కమిటీలో అధికారులు ఇలాంటి వారికి ఎలా చోటు కల్పించారని ప్రశ్నించారు. ఎస్సీలకు కూడా కమిటీలో చోటు ఇవ్వలేదని ఆగ్రమం వ్యక్తం చేశారు. కమిటీ తీరు కారణంగా స్థానికంగా ఉన్న అర్హులకు సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కల్పించుకుని సవరించాలని కోరారు. సమావేశంలో నాయకులు అశోక్‌, నర్సింహా, ఖదీర్‌, పి.నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి 1
1/1

సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement