కిరాయి కిరికిరికి స్వస్తి!
30 శాతానికి పైగా అద్దె భవనాల్లోప్రభుత్వ ఆఫీసులు, సర్కారు బడులు తాజాగా ప్రభుత్వ భవనాల్లోకి తరలింపునకు ఆదేశాలు ఖాళీ ప్రభుత్వ భవన సముదాయాల వేటలో అధికారులు ఫిబ్రవరి నుంచి అద్దె భవనాలకు చెల్లింపు నిలిపివేత
సాక్షి, సిటీబ్యూరో: సొంత భవనాలు లేక..అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, సర్కారు బడులకు ఇక కిరాయి కిరికిరి తప్పనుంది. తాజాగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆఫీస్‌లు, పాఠశాలలను ప్రభుత్వ భవన సముదాయాలకు తరలించాలని సర్కారు ఆదేశాలు జారీ చేయడంతో వివిధ శాఖల్లో కసరత్తు ప్రారంభమైంది. ప్రభుత్వం ఏకంగా ఫిబ్రవరి నుంచి అద్దె భవనాలకు చెల్లించే అద్దెలను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేసింది. దీంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్న వివిధ శాఖల అధికారులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవన సముదాయాల వేటలో పడ్డారు. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 30 శాతం పైగా ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ఖాజానాకి ఆదాయం సమకూర్చే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఆర్‌టీఓతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బస్తీ దవాఖానాలు, అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఏటా అద్దెల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు విజయవాడకు తరలిపోవడంతో హైదరాబాద్‌లో పరిశ్రమ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్, బీఆర్‌కేఆర్ భవన్, ఎర్రమంజిల్ వంటి పలు ప్రభుత్వ భవనాలు ఖాళీ అయ్యాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే అద్దె ఖర్చులను భారీగా ఆదా చేయవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే..
రాష్ట్ర రాజధాని మహా హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు అద్దె భవనాల్లోనే అత్యధికగా ఉన్నాయి. చార్మినార్, బహదూర్‌పురా వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నాంపల్లి మండలంలోని బజార్–ఎ–జుమేరాత్ ప్రాథమిక పాఠశాల 1975 నుంచి, కోట్లా అలీజా బాలికల హైస్కూల్ 1995 నుంచి అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. .మరోవైపు బస్తీ దవాఖానాలది కూడా ఇదే పరిస్థితి. వీటి అద్దెల చెల్లింపు ప్రభుత్వానికి భారంగా మారతోంది. అంతేకాదు చెల్లిస్తున్న అద్దెకు..భవనంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలకు పొంతన లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండి ఇబ్బంది పడేకన్నా..ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకాలం ఇరుకై న అద్దె భవనాల్లో కొనసాగుతూ..ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారాని కార్యాలయాలన్నింటినీ తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భవనాలను గుర్తించి, వాటిలోకి షిఫ్ట్ కావాలని ఆదేశించింది.
రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నా..
ప్రధానంగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి మెజార్టీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగతున్నాయి. గ్రేటర్ పరిధిలోని దాదాపు 30 శాతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మహిళా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలుండగా వీటిలో మెజార్టీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితికూడా ఇదే. వివిధ గురుకులాలు, చివరికు పోస్టు ఆఫీసులు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే సొంతంగా భవనాలు నిర్మించి ఇవ్వాలని ఏళ్లుగా ఆయా శాఖల అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. కొన్ని భవనాలకు శంకుస్థాపనలు కూడా చేశారు. మరికొన్నింటి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి..కిరాయి భవనాన్ని ఖాళీ చేసి వెళ్లడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. లీజు అగ్రిమెంట్లు, అద్దె బకాయిలు ఉండగా, కేవలం పది రోజుల వ్యవధిలోనే ప్రైవేటు భవనాలను ఖాళీ చేసి..ప్రభుత్వ భవనంలోకి వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమనే కొందరు అధికారులు పేర్కొంటున్నారు.


