చెరువులోకి చేరేదెన్నడో!
షాద్‌నగర్: వర్షాకాలంలో నిండిన చెరువులతో రైతులు సాగుబాట పడితే.. అవే చెరువులను మత్స్యకారులు జీవనోపాధిగా మలుచుకుంటున్నారు. మత్స్యకారుల ఉపాధిని ప్రోత్సహించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఊసేలేదు. దీంతో ఈసారి చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం నీటి వనరులున్న చెరువులు, కుంటలు వెయ్యి వరకు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 15వేల హెక్టార్ల వరకు ఉంటుంది. జిల్లాలో 210 పైగా మత్స్యసహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో మత్స్యకారులు 10వేల మంది, మత్స్యకార వృత్తిపై సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 2016–17లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. గత ఏడాది చేప పిల్లల పంపిణీ కోసం రూ.93 లక్షలు కేటాయించి అక్టోబర్‌లో సుమారు 400 చెరువుల్లో మాత్రమే చేపపిల్లలను వదిలారు. గత ప్రభుత్వ హయంలో మత్స్యశాఖపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.
ఊసేలేని టెండర్ ప్రక్రియ
ప్రతి ఏడాది మేలోనే చేప పిల్లల కొనుగోలు కోసం ప్రభుత్వం టెండర్లను పిలిచేది. వర్షాలు కురిసి చెరువుల్లో నీరు చేరితే ఆగస్టులో మత్స్యకారులకు ఆ శాఖ అధికారులు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసేవారు. ఈ ఏడాది మే నెల పూర్తి కావస్తున్నా నేటికీ చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చేప పిల్లల కొనుగోలుకు టెండర్ పిలవాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు వర్షాలు
ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో వర్షాలు ప్రారంభం అయ్యాయి. జలాశయాల్లో నీరు చేరే సమయానికి ఉచిత చేప పిల్లలను వదిలే అవకాశం ఉంటుందో లేదో అన్నది అనుమానంగా ఉంది. ఈ ఏడాది నేటికీ చేప పిల్లల టెండర్ ప్రక్రియ మొదలు కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏటా జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో చేప పిల్లల పంపిణీ జరిగేది. అప్పటి వరకు వర్షాలు పుష్కలంగా కురిసి చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటాయి. ఆ సమయంలో చేప పిల్లలు వదిలితే అవి చక్కగా ఎదిగేందుకు అవకాశం ఉండడంతో పాటు ఎదిగిన చేపల విక్రయాల ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది. ఆలస్యం చేస్తే చేపలు ఎదగడం కష్టంగా మారుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని, దీంతో చేప పిల్లలు సరిగా ఎదగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.


