మైనింగ్‌ ఏర్పాటు వద్దు | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ ఏర్పాటు వద్దు

May 29 2025 9:51 AM | Updated on May 29 2025 9:51 AM

మైనింగ్‌ ఏర్పాటు వద్దు

మైనింగ్‌ ఏర్పాటు వద్దు

● పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ● సమావేశానికి బయటి వ్యక్తులను తీసుకువచ్చిన నిర్వాహకులు

కందుకూరు: మైనింగ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనల నడుమ ముగిసింది. కందుకూరు రెవెన్యూ సర్వే నంబర్‌ 338, 339లో 4.75 హెక్టార్ల భూమిలో మెస్సర్స్‌ గాంగే మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మైనింగ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. అందుకు సంబంధించి పర్యావరణ అనుమతులకు కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటనర్సయ్య, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ గోపాల్‌ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కాగా ఆ భూమికి చుట్టు పక్కల ఉన్న రైతులు మైనింగ్‌ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎస్‌.పాండు, మాజీ ఉప సర్పంచ్‌ జి.సుధాకర్‌రెడ్డి, రైతులు జగన్‌, బీరప్ప, విలాసిత్‌రెడ్డి తదితరులు మా ట్లాడుతూ.. 20 ఏళ్లుగా తమ భూముల పక్కనే మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడంతో చాలా ఇబ్బందులు పడ్డా మని తెలిపారు. బ్లాస్టింగ్‌లతో బోర్లలో మోటార్లు కూరుకుపోవడం, పొలాల్లో రాళ్లు వచ్చి పడడం, దు మ్ము, ధూళితో పంట నష్టపోయామని వాపోయా రు. మైనింగ్‌ ఏర్పాటు చేయవద్దని తేల్చి చెప్పా రు. కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మైనింగ్‌ ఏర్పాటు చేయాలని, మరికొందరు మాత్రం రైతులకు ఇబ్బందులు కలుగకుండా వారిని ఒప్పించాలని సూచించారు. సమీప గ్రామం తిమ్మాయిపల్లికి చెందిన కొందరు మా త్రం మైనింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

సమావేశంలోసంబంధం లేని వ్యక్తులు

కాగా పర్యావరణ ప్రజాభిప్రాయం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బుధవారం ఉదయం మైక్‌ ద్వారా దండోరా వేయించడం గమనార్హం. దీంతో చాలా మందికి అక్కడ అభిప్రాయ సేకరణ ఉందనే విషయమే తెలియదు. మరోపక్క మైనింగ్‌ కంపెనీ నిర్వాహకులు మాత్రం ముందు జాగ్రత్తగా బయటి ప్రాంతాల నుంచి సంబంధంలేని వ్యక్తులను తీసుకువచ్చి కూర్చోపెట్టారు. వారితో తమకు అనుకూలంగా చెప్పించుకునే ప్రయత్నం చేశారు. విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తం చేసిన అంశాలను పైఅధికారులకు నివేదిస్తామని ఈ సందర్భంగా ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో నాయబ్‌ తహసీల్దార్‌ రాజు, ఆర్‌ఐ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement