కారెనుక.. కారుగట్టి | - | Sakshi
Sakshi News home page

కారెనుక.. కారుగట్టి

Apr 26 2025 8:06 AM | Updated on Apr 26 2025 8:06 AM

కారెనుక.. కారుగట్టి

కారెనుక.. కారుగట్టి

సాక్షి, రంగారెడ్డి జిల్లా : వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తితో ఆదివారం జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభకు గ్రేటర్‌ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం ఐదు వేల మందిని తరలించాలని తీర్మానించింది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు 1,200 బస్సులు సహా మరో 1,500కుపైగా కార్లను కేటాయించింది. అధిష్టానం ఈ బాధ్యతను మాజీ మంత్రులు మహ్మద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు గౌడ్‌, సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అప్పగించింది. ఇప్పటికే వీరంతా ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, మండలం, గ్రామ పంచాయతీల వారీగా బస్సులు, కార్లు, ఇతర వాహనాలను కేటాయించారు. ‘ఇంటికో జెండా.. ఊరికో బస్సు’ చొప్పున గ్రేటర్‌ జిల్లాల నుంచి లక్ష మందిని తరలించాలని నిర్ణయించారు.

పురుషులనే ఎక్కువగా తరలించాలని..

భగ్గున మండుతున్న ఎండల నేపథ్యంలో మహిళలు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పురుషులనే ఎక్కువగా తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తలను, అభిమానులను సన్నద్ధం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం, క్యాంపు ఆఫీసుల నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు. ఎవరికి వారు ఆయా సమీప మార్గాల నుంచి ఔటర్‌ మీదుగా ఘట్‌కేసర్‌ జంక్షన్‌కు చేరుకోనున్నారు. అటు నుంచి భారీ ర్యాలీగా వరంగల్‌ బయలుదేరనున్నారు. సభకు వచ్చే ముఖ్య నాయకులు, కార్యకర్తలకు తాగునీరు, భోజన వసతి కల్పించనున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు టూరిస్ట్‌ బస్సులతో పాటు మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీల బస్సులను కేటాయించారు.

25 ఏళ్లు.. ఎన్నో ఆటుపోట్లు

1969 తెలంగాణ తొలి దశ ఉద్యమం తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఆవిర్భవించింది. కేసీఆర్‌ సహా ఆచార్య జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ఆలే నరేంద్ర, గాదె ఇన్నయ్య తదితరులు మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత 2003 ఏప్రిల్‌ 27న సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వేదికగా శ్రీతెలంగాణ గర్జనశ్రీ పేరుతో ద్వితీయ వార్షికోత్సవ సభను నిర్వహించారు. 2001 నుంచి 2014 వరకు టీఆర్‌ఎస్‌ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌) అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. అప్పటి వరకు ఒక్క సికింద్రాబాద్‌ (పద్మారావు గౌడ్‌) మినహా గ్రేటర్‌లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఆ సమయంలో తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంది. 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పోరు గర్జనతో కేంద్రం స్పందించింది. డిసెంబర్‌ 9న ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసింది. కొందరి అభ్యంతరాలతో డిసెంబర్‌ 23న కేంద్రం మళ్లీ వెనక్కి తగ్గింది. 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌, ఆ తర్వాత సకల జనుల సమ్మె, ఉద్యోగుల సహాయ నిరాకరణ వంటి వరుస ఆందోళనలతో చివరకు కేంద్రం దిగొచ్చింది.

గ్రేటర్‌లో అనేక అభివృద్ధి పనులు

2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది, జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అప్పటివరకు గ్రేటర్‌ జిల్లాల్లో పార్టీకి పెద్దగా బలం లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి భారీగా పార్టీలోకి వలసలు పెరిగాయి. మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు సహా గ్రేటర్‌ పీఠాన్ని కై వసం చేసుకుంది. 2018 నాటికి మరింత బలపడింది. పదేళ్లు అధికారంలో ఉండి గ్రేటర్‌లో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. 2024 ఎన్నికల్లో ఎల్బీనగర్‌, మహేశ్వరం, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో గెలుపొందింది. రూరల్‌ జిల్లాలతో పోలిస్తే.. గ్రేటర్‌ జిల్లాల్లోనే పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలవడం, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి, భారీగా నిధుల కేటాయింపుల పేరుతో రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ముఖ్య నేతలు పార్టీ మారినా.. కేడర్‌ మాత్రం కేసీఆర్‌ నాయకత్వాన్నే నమ్ముకుని పని చేస్తోంది.

రేపు ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

గ్రేటర్‌ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ

ఒక్కో నియోజకవర్గం నుంచిఐదు వేల మంది

1,200 బస్సులు సహా 1,500కు పైగా కార్లు సిద్ధం

సమన్వయం చేస్తున్న పార్టీ ప్రధాన నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement