
సాగులో ఏఐ వినియోగంపై అవగాహన ఒప్పందం
● ముందుకువచ్చిన ఏజీ వర్సిటీ, బిట్స్ పిలానీ సంస్థలు
ఏజివర్సిటీ: వ్యవసాయంలో కృత్రిమ మేధ వినియో గంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని అగ్రి హబ్‌లో జరిగిన కార్యక్రమంలో పీజేటీఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లాస్ జానయ్య, బిట్స్ పిలాని ఉపకులపతి ప్రొఫెసర్ వి.రాంగోపాల్‌రావు సమక్షంలో అవగాహన ఒప్పందం పత్రాలపై ఇరు సంస్థల అధికారులు సంతకాలు చేశారు. పరస్పరం ఒప్పంద పత్రాల్నిమార్చుకున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మకమైనసంస్థల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం సంయుక్తంగా పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనకు, పీహెచ్‌డీ విద్యార్థులకు పరిశోధన సలహాలు ఇవ్వడానికి దోహదం చేస్తుందని బిట్స్ పిలాని ఉపకులపతి ప్రొఫెసర్ వి.రాంగోపాల్‌రావు అన్నారు. ఇరు సంస్థల శాస్త్రవేత్తలు కలిసి నాణ్యమైన పరిశోధనా పత్రాలు ప్రచురించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. దుబాయ్‌తో పాటు దేశంలోని నాలుగు చోట్ల బిట్స్ క్యాంపస్‌లు ఉన్నాయని, అందులో ప్రతి ఏటా సుమారు 600 మంది పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. బిట్స్ పిలానీ సంస్థకు దేశంలోనే మూడో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ నెట్‌వర్క్ ఉందని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ పరిజ్ఞానం (హార్డ్‌వేర్), బిట్స్ పిలానిలోని సాఫ్ట్‌వేర్ కలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఉపకులపతి జానయ్య తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల సాగుకు ఉపయోగపడే అగ్రి రోబోల రూపకల్పన జరగాలని జానయ్య ఆకాంక్షించారు. పరిశోధనా సంచాకులు డాక్టర్ బలరాం అవగాహన ఒప్పందం ముఖ్య లక్ష్యాల గురించి సమావేశంలో వివరించారు. రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, బిట్స్ పిలాని డీన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ సంకేత్ గోయల్, పీజేటీఏయూ అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకులు డాక్టర్ రాములు, డిజిటల్ అగ్రికల్చర్ సంచాలకులు డాక్టర్ బాలాజీనాయక్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.