అదృశ్యమై.. చెరువులో శవమై.. | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమై.. చెరువులో శవమై..

Apr 25 2025 11:31 AM | Updated on Apr 25 2025 11:54 AM

అదృశ్

అదృశ్యమై.. చెరువులో శవమై..

మొయినాబాద్‌: భార్యతో గొడవ పడి అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపల్లికి చెందిన మల్కపురం రాజ(37) పెయింటర్‌గా పనిచేసేవాడు. ఈ నెల 21న రాత్రి మద్యం మత్తులో భార్య స్వప్నతో గొడవ పడ్డాడు. 22న తెల్లవారు జాము 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తెలిసిన చోట్ల ఆరా తీశారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడి భార్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువులో రాజు మృతదేహం తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీశారు. వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

శంకరయ్యకు డాక్టరేట్‌

మహేశ్వరం: మహేశ్వరం మండల పరిధి కల్వకోల్‌ గ్రామానికి చెందిన పులిమామిడి శంకరయ్య ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌కు ఎంపికయ్యాడు. ఓయూలో తెలుగు ఓరియంటల్‌ విభాగంలో తెలుగు శాఖలో పీహెచ్‌డీ చేశారు. ఆ విభాగంలో డాక్టర్‌ చవ్వ వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో.. రంగారెడ్డి జిల్లా జానపద మౌఖిక కథలు, సమగ్ర పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించిన తనకు, ఈ డాక్టరేట్‌ రావడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. శంకర్‌ను గ్రామస్తులు అభినందించారు. త్వరలో డాక్టరేట్‌ పట్టా, ప్రశంసా పత్రం అందుకోనున్నారు.

బైక్‌ను ఢీకొట్టిన ఆటో..

ఇద్దరు విద్యార్థులకు గాయాలు

మొయినాబాద్‌: అతివేగంతో ఎదురుగా వచ్చిన ఆటో, బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్‌– బీజాపూర్‌ జాతీయ రహదారిపై మొయినాబాద్‌ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా ఆలంపల్లికి చెందిన మహ్మద్‌ ముబీన్‌, అతడి స్నేహితుడు షాబాద్‌ మండలం నాగర్‌గూడకు చెందిన మహ్మద్‌ ముదాసిర్‌.. మొయినాబాద్‌ మున్సిపల్‌ పరిధి గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం 2.30లకు ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌పై ఇద్దరు కలిసి కళాశాలకు వెళ్తుండగా, రాధాస్వామి సత్‌సంగ్‌ సమీపంలోకి రాగానే.. ఎదురుగా వచ్చిన ఆటో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 అంబులెన్స్‌లో స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బాలికపై కుక్కల దాడి

షాద్‌నగర్‌: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై గ్రామ సింహాలు దాడి చేశాయి. ఈ ఘటన పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న నాగరాజు కూతురు అవని(8), ఇంటి ముందు ఆడుకుంటుండగా.. బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువ అయిందని, మున్సిపల్‌ అధికారులు స్పదించి శునకాలను తరలించాలని కోరుతున్నారు.

పెట్టుబడి పేరుతో టోకరా

సనత్‌నగర్‌: పెట్టుబడి పేరుతో వాట్సప్‌లో వచ్చిన సందేశానికి ఆకర్షితుడైన ఓ వ్యక్తి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.1,07,000 టోకరా వేసిన ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సనత్‌నగర్‌లో నివాసం ఉండే నాగరాజు ఫోన్‌ వాట్సప్‌కు పెట్టుబడి పేరుతో సందేశం వచ్చింది. ఆ సందేశం నాగరాజును ఆకట్టుకుంది. ఎలా పెట్టుబడి పెట్టాలో వారిని అడగ్గా వారు మార్గనిర్దేశం చేశారు. దీనికి ఫిర్యాదుదారుడు నమ్మి రూ.1,07,000 భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత వారు చెప్పిన అన్ని పనులు పూర్తి చేశాడు. కానీ పెట్టుబడితో పాటు వారు ఇస్తానన్న కమిషన్‌ కూడా రాలేదు. దీంతో తాను ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ నాగరాజు వారిని అడగ్గా ఎటువంటి స్పందన లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమై.. చెరువులో శవమై.. 
1
1/2

అదృశ్యమై.. చెరువులో శవమై..

అదృశ్యమై.. చెరువులో శవమై.. 
2
2/2

అదృశ్యమై.. చెరువులో శవమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement