‘భరోసా’ కొందరికే..!
చేవెళ్ల: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ‘భరోసా’ పై స్పష్టత కరువైంది. అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రెండువిడతల్లో రూ.12వేల చొప్పున రైతు భరోసా సొమ్ము నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందించలేకపోతోంది. భరోసా వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. మార్చి 31వ తేదీ వరకు అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో అందిస్తామని ప్రకటించినప్పటికీ 31 దాటిపోయినా పూర్థిసాయిలో డబ్బులు జమ కాలేదు. చేవెళ్ల డివిజన్‌లోని ఐదు మండలాలకు సంబంధించి మొత్తం 73,729 మంది రైతులు ఉండగా 58,082 మందికి సుమారు రూ.42 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. వీరిలో ఎంత మందికి ఎన్ని ఎకరాలకు అనే స్పష్టత లేదు. దాదాపు నాలుగు ఎకరాల లోపు రైతులకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 7,51,441 ఎకరాలు ఉండగా ఇందులో 50,119 ఎకరాలు సాగుకు యోగ్యంగా లేని భూములుగా 7,01,322 ఎకరాలు సాగు భూములుగా గుర్తించారు. విడతల వారీగా విడుదల చేసిన వారికి కూడా పూర్తిస్థాయిలో భరోసా సొమ్ము అందడం లేదు.
తప్పుల తడక జాబితాతో..
భూ సమస్యలు, సాగుయోగ్యం కాని భూముల లెక్కల తేడాలతో జిల్లాలో చాలామంది అర్హులైన రైతులు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు జమ కావడం లేదు. ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతులకు సైతం సాయం అందక బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఒక సర్వే నంబర్‌లో భూమి ఉన్నదాని కంటే రికార్డుల్లో ఎక్కువగా(ఆర్‌ఎస్‌ఆర్) ఉంటే ఆ సర్వే నంబర్ మొత్తం నిలిచిపోయింది. ప్లాట్లు, వెంచర్లు, ఫాంలాండ్స్‌గా గుర్తించిన వాటితో పాటు రైతుల భూములు కూడా తప్పుగా పడడంతో వాటికి ఆగిపోయాయి. వ్యవసాయాధికారులు రికార్డు చేసే సాగుభూముల రికార్డుల్లో సాగు చేస్తున్నట్లుగా నమోదు చేయని భూములకు సైతం రైతు భరోసా రావడం లేదు. రికార్డులు తప్పులతడకగా ఉన్నాయని, దీంతో తాము పథకానికి నోచుకోలేకపోతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతులందరికీ రైతుభరోసా అందించాలని కోరుతున్నారు.
అందరికీ అందని ‘రైతు భరోసా’
పూర్తిస్థాయిలో జమకాని డబ్బులు
ఎదురుచూస్తున్న అన్నదాతలు
బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ఎందుకు రాలేదో ఏమో..
నాది మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామం. చేవెళ్ల మండలం మల్కా పూర్‌లో 18 ఏళ్ల కిత్రం 1.4 ఎకరాలు కొన్నాను. వర్షా ధార పంటలు వేస్తున్నాను. నాకు రైతు భరోసా డబ్బులు రాలేదు. ఎందుకు రాలేదో తెలియడం లేదు. అధికారులను అడిగితే ప్రాసెస్‌లో ఉంది వస్తుంది అని చెబుతున్నారు.
– కనకమామిడి జంగయ్య, రైతు
విడతల వారీగా జమ
ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడతల వారీగా వేస్తోంది. ఎన్ని ఎకరాలు, ఎలా అనేది ప్రభుత్వ నిర్ణయం. మాకు కూడా ఎలాంటి సమాచారం లేదు. డివిజన్‌లో ఎంత మందికి వస్తున్నాయి అనేది ఆన్‌లైన్ ద్వారా తెలుస్తుంది. ఏదైనా కారణం చేత రాని రైతులు వచ్చి అడిగితే పరిశీలించి చెబుతున్నాం.
– సురేష్, ఏడీఏ, చేవెళ్ల
‘భరోసా’ కొందరికే..!
‘భరోసా’ కొందరికే..!


