సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మీర్‌పేట: విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాల 23వ వార్షికోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది పట్టభద్రులు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదవాలని ఆయన సూచించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని కళాశాల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. వేడుకలో కళాశాల కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, కోశాధికారి అమర్‌నాథ్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.


