బంజారాహిల్స్: ఎండాకాలంలో నీటి ఎద్దడిని నివారించేందుకు జలమండలి అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, నగరవాసులు కూడా వారికి సహకరించాల్సిన అవసరం ఉందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అసోసియేషన్ కార్యాలయంలో మేయర్ జలమండలి, జీహెచ్‌ఎంసీ, కాలనీ వాసులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జలమండలి నీటితో కొంతమంది నిత్యం తమ కార్లు, ఇంటి ముందున్న బండలు, రోడ్లు కడుగుతున్నారని, వారికి నీటి విలువ తెలియడం లేదన్నారు. అలా ఇష్టారాజ్యంగా కార్లు కడుగుతున్న వారికి రూ.10 వేల జరిమానా విధించాలంటూ జలమండలి అధికారులను ఆమె ఆదేశించారు. అదే విధంగా ఎమ్మెల్యే కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర కో– ఆపరేటివ్ సొసైటీ ఎమ్మెల్యే కాలనీ అధ్యక్షుడు టి. నారాయణరెడ్డి, జలమండలి జీఎం హరిశంకర్, జీహెచ్‌ఎంసీ ఈఈ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.