అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణిలో వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 40 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను శాఖల వారీగా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 21, ఇతర శాఖలకు సంబంధించి 19 అర్జీలు అందినట్లు తెలిపారు.
తాటిచెట్లు కూల్చిన వారిపై
చర్యలు తీసుకోండి
ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని బొంగ్లూర్‌లో గీత కార్మికుల వృత్తిని దెబ్బతీసే విధంగా తాటి చెట్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తమను ఆదుకోవాలని కోరారు.
యూరియా కొరత లేదు
జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోపని చేస్తున్న అన్ని పంపిణీ కేంద్రాల్లో అవసరమైనంత స్టాక్ ఉందని స్పష్టం చేశారు. రైతులకు సజావుగా పంపిణీ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.రైతులకు స్పష్టంగా కనిపించే విధంగా స్టాక్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగాపర్యవేక్షణ చేపడతామని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.


