ముగిసిన పుస్తక ప్రదర్శన
ఈ సారి భారీగా తరలివచ్చినపుస్తక ప్రియులు కిక్కిరిసిన స్టాళ్లు
సాక్షి, సిటీబ్యూరో: పుస్తకప్రియులను, సందర్శకులను కట్టిపడేసిన హైదరాబాద్ 38వ పుస్తక ప్రదర్శన సోమవారం ముగిసింది. చివరి రోజు కూడా సందర్శకులు భారీగా తరలివచ్చారు. పిల్లలు, పెద్ద లు, యువతీ యువకులు తదితర అన్ని వర్గాలకు చెందిన పాఠకులు ఉత్సాహంగా పుస్తక మహోత్సవంలో భాగస్వాములయ్యారు. నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేశారు. గత సంవత్పరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చినట్లు బుక్‌ఫెయిర్ కమిటీ నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 11 రోజుల్లో కనీసం 15 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు అంచనా. వరుస సెలవులు కూడా పుస్తక ప్రదర్శనకు బాగా కలిసి వచ్చాయి. దీంతో బుక్‌ఫెయిర్ సందర్శకులతో కళకళలాడింది. కొనుగోలుదారులతో స్టాళ్లు కిక్కిరిసిపోయాయి.
నవలలు, కథల పుస్తకాలకు ఆదరణ
చరిత్ర, సంస్కృతి గ్రంథాలతో పాటు నవలలు, కథల పుస్తకాలకు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. ఆధ్యాత్మిక రంగానికి చెందిన పుస్తకాలు కూడా బాగానే అమ్ముడైనట్లు పలు ప్రచురణ సంస్థలు తెలిపాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలకు ప్రోత్సాహకంగా ప్రత్యేకంగా కొన్ని స్టాళ్లను కేటాయించారు. అన్ని రకాల పుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌కు కూడా ఆదరణ కనిపించింది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈసారి వందకు పైగా కొత్త పుస్తకాలను ఆవిష్కరించారు. నవతరం రచయితలు తమ రచనలను పాఠకులకు పరిచయం చేశారు. హైదరాబాద్ సాంస్కృతిక జీవితంలో భాగంగా ప్రతి సంవత్సరం వంద లాది పుస్తక ప్రచురణ సంస్థలతో, లక్షలకొద్దీ పుస్తకాలతో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన మరోసారి అదరహో అనిపించింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులను అలరించాయి. నచ్చిన పుస్తకాలపై నిర్వహించిన ప్రసంగాలు సాహిత్య పరిమళాలను గుబాళించాయి. ఈ ఏడాది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు ప్రముఖ కవి అందెశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశారు. అలాగే అనిశెట్టి రజిత, కొంపెల్లి వెంకట్‌గౌడ్‌ల స్మారకార్థం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి సాహిత్య రంగానికి వారు అంద జేసిన సేవలను గుర్తుచేశారు.
చివరి రోజు పోటెత్తిన సందర్శకులు


