ధ్యానంతో ఒత్తిడి దూరం
కడ్తాల్: మనం సన్మార్గంలో నడుస్తున్నప్పుడు విశ్వం తోడుగా ఉంటుందని, దేనికీ భయపడాల్సిన అవసరం లేదని ధ్యాన గురువు పరిణిత పత్రి అన్నారు. మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్ కై లాసాపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయాగ వేడుకలు సోమవారానికి తొమ్మిదో రో జుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతం నుంచి భయం పుడుతుందని, భయంతో ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి నిర్భయంగా ఉంటారన్నారు. ధ్యానాన్ని ప్రజలందరికీ చేరువ చేసేందుకు పత్రీజీ ఎన్నో త్యాగాలు చేశారని పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు అన్నారు. బ్రహ్మర్షీ పత్రీజీ ఆశయాలైన ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరిమిడ్ జగత్ కోసం ప్రతి ధ్యాని విశేష కృషి చేయాలని కోరారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
మహా పిరమిడ్‌తో ప్రత్యేక గుర్తింపు
బ్రహ్మర్షీ సుభాష్ పత్రీజీ గొప్ప సంకల్పంతో ఇక్కడ నిర్మించిన మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంతో కడ్తాల్‌కు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ధ్యాన మహాయాగంలో భాగంగా సోమవారం మహాపిరమిడ్‌కు వచ్చిన ఆయన ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు. పత్రీజీ గొప్ప దైవ సంకల్పంతో ప్రపంచాన్ని ధ్యాన మయం చేసేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.


