షాద్‌నగర్‌ ఆస్పత్రిలో కాయకల్ప బృందం | - | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్‌ ఆస్పత్రిలో కాయకల్ప బృందం

Mar 23 2025 9:26 AM | Updated on Mar 23 2025 9:20 AM

షాద్‌నగర్‌: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని శనివారం కాయ కల్ప బృందం సందర్శించింది. ఈ సందర్భంగా డాక్టర్‌ వై.ప్రజ్ఞారెడ్డి ఆధ్వర్యంలో బృందం సభ్యులు ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. స్వచ్ఛత, బయో మెడికల్‌ వేస్టేజ్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌, పారిశుద్ధ్య కార్మికుల రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ప్రసవాల సంఖ్య, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, జరుగుతున్న అభివృద్ధి, ఆస్పత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ మాధవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మోకిల సీఐ వీరబాబుకుసైబరాబాద్‌ సీపీ అభినందన

శంకర్‌పల్లి: భార్యను రాయితో మోది హత్య చేసిన కేసును ఛేదించడంలో విశేషంగా కృషి చేసి, నిందితుడైన భర్తకు శిక్ష పడేలా చేసిన మోకిల సీఐ వీరబాబుని శనివారం సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి, జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఐకి నగదు ప్రోత్సాహకం అందించారు. గతేడాది ఏప్రిల్‌లో మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్‌లో ఓ వ్యక్తి తాగిన మైకంలో భార్యతో గొడవపడి రాయితో మోది హత్య చేశాడు. మోకిల సీఐ వీరబాబు నిందితుడిని అదుపులోకి తీసుకొని, లోతుగా విచరాణ చేపట్టి చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టుకి పక్కా వివరాలు సమర్పించడంతో ఎల్‌బీనగర్‌ కోర్టు గత ఫిబ్రవరిలో నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

26న ఎమ్మార్పీఎస్‌ విజయోత్సవ ర్యాలీలు

కొందుర్గు: ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26న అన్ని మండల కేంద్రాల్లో విజయోత్సవ ర్యాలీలు ఉంటాయని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ అన్నారు. కొందుర్గులో శనివారం ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఆనంద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. దీంతో మాదిగల 70 ఏళ్ల కల సాకారమైందని అన్నారు. ఈ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఉదయ్‌కుమార్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్‌, దర్శన్‌, రామకృష్ణ, యాదయ్య, రమేష్‌, యాదగిరి, రామచంద్రయ్య, రమేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ రహిత తెలంగాణకు సహకరించండి: సీతక్క

సైదాబాద్‌: డ్రగ్స్‌ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర పరిశీ లన గృహంలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణలోని అబ్జర్వే షన్‌ హోం పిల్లల కోసం పైలట్‌ ప్రాజెక్ట్‌గా సైదాబాద్‌లోని హోంలో సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడ ప్రత్యేక మానసిక నిపుణుల బృందం మాదక ద్రవ్యాలకు బానిసైన పిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన కౌన్సెలింగ్‌, వైద్య చికిత్సలు సహా అనేక సేవలను అందిస్తారని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసైన పిల్లల కుటుంబాలకూ అవగాహన పెంచుతామన్నారు. త్వరలోనే ఇలాంటి డీ అడిక్షన్‌ సెంటర్లను అన్ని అబ్జర్వేషన్‌ హోంలలో ఏర్పాటు చేయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement