ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున వాటిని ప్రోత్సహించేందుకు ఎంఎస్‌ఎంఈ ద్వారా రుణాలు అందించాలన్నారు. యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రానున్న సీజన్‌లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు సకాలంలో అందించాలని తెలిపారు. పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పథకాల కింద ఎంపికై న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు పంపిణీలో జాప్యం చేయవద్దని చెప్పారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు యూనిట్ల గ్రౌండింగ్‌లో జాప్యం జరుగుతుందని చెప్పగా కలెక్టర్ స్పందించి వెంటనే పనులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ శ్రీదేవి, లీడ్‌బ్యాంక్ మేనేజర్ కుసుమ, నాబార్డు ఏజీఎం, వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీలత, మెప్మా పీడీ మల్లీశ్వరీతో పాటు వివిధ బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు కృషి చేయాలి
కలెక్టర్ నారాయణరెడ్డి