
‘ఆహార భద్రత’కు భంగం కలిగిస్తే చర్యలు
కడ్తాల్: ఆహార భద్రత హక్కుకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణంతో పాటు, అంగన్వాడీ కేంద్రం, బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, కేజీబీవీ, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్‌రెడ్డి, జ్యోతి, అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలోని రేషన్‌షాపును తనిఖీలు చేపట్టారు. అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు పంచదార అందించడం లేదని తెలుసుకున్నారు. దీనిపై 30 రోజుల్లో కమిషన్‌కు నివేదిక అందించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రేషన్ షాపుల వద్ద ఫిర్యాదు బాక్స్, స్టాక్ వివరాలు, సంబంధిత పౌర సరఫరా శాఖ అధికారుల ఫోన్ నంబర్ల వివరాలు ఖచ్చితంగా పెట్టాలని కమిషన్ బృందం ఆదేశించింది.
గుడ్లు పంపిణీ చేసిన ఎజెన్సీకి నోటీసులు
అంగన్వాడీ కేంద్రం–2, 4 కేంద్రాలను సందర్శించి చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహా రం నిల్వలను, రికార్డులను పరిశీలించారు. గుడ్డు పరిమాణం తక్కువగా ఉందని.. గుడ్లు పంపిణీ చేసిన ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాలని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్(డీడబ్ల్యూఓ)ను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, కేజీబీవీ, బాలుర ఉన్నత పాఠశాల, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను, ఫుడ్ కమిషన్ సభ్యులు సందర్శించారు. ఆయా పాఠశాలల్లోని సమస్యలను విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ పాఠశాల బాలికల్లో రక్తహీనత ఉందని, దానిని అధిగమించేందుకు పోషకాలు అఽధికంగా ఉన్న ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో వెంటనే ఏఎన్‌ఎంను నియమించాలని అఽధికారులను ఆదేశించారు. కేజీబీవీ పాఠశాలలో నీటి సమస్య ఉందని, పాఠశాల ఎస్‌ఓ అనిత కమిషన్ సభ్యుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపాలని ఉపాధ్యాయులకు సూచించారు. జాతీయ ఆహర భద్రత చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీటీడీఓ రామేశ్వరి, ఏటీడీఓ వెంకటయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ డీసీఎస్‌ఓ శ్రీనివాస్, మేనేజర్ గోపీకృష్ణ, డీడబ్ల్యూ సంధ్య, సీడీపీఓ శాంతిరేఖ, డీఆర్‌డీఏ ఏపీడీలు, నరేందర్‌రెడ్డి చరణ్‌గౌతమ్, తహసీల్దార్ ముంతాజ్, ఎంపీడీఓ సుజాత, ఎంఈఓ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఏసీఎం రాజేశ్వరి, డీటీలు రవీందర్‌నాయక్, భానుప్రకాశ్, కార్యదర్శి అల్లాజీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి