సమస్యలు తీరవు, బాధలు పట్టవు
● కాగితాలు తీసుకొని పొమ్మంటున్నారు ● ఫిర్యాదుదారుల ఆవేదన ● ప్రజావాణికి 72 దరఖాస్తులు
ఇబ్రహీంపట్నం రూరల్: ‘సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రజావాణి దండగ’ అని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితం తీసుకునే వరకు లైన్లో ఉండాలని, మేడమ్ వద్దకు వెళ్లగానే ఏం మాట్లాడకుండా కాగితం తీసుకొని పోలీసుల చేత వెనక్కి పంపిస్తున్నారని పేర్కొంటున్నారు. సమస్యలు తీరవు, మా బాధలు ఎవరికీ పట్టవు. ఇక మాకు చావేదిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
72 ఫిర్యాదులు
ప్రతివారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రెవెన్యూ, ఇతర సమస్యలపై చేవెళ్ల, కొందుర్గు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, షాబాద్, ఆమనగల్లు తదితర ప్రాంతాల నుంచి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 72 ఫిర్యాదులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకే ఏకంగా 40 అర్జీలు రాగా, ఇతర శాఖలకు 32 వచ్చాయి. ఈ దరఖాస్తుల స్వీకరణలో అదనపు కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, మండల తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.