కొడంగల్ రూరల్: పట్టణంలోని శ్రీనిరంజన మఠంలో ఆదివారం వీరశైవ సమాజం భక్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు మఠం మల్లికార్జునస్వామి, గడ్డం చంద్రశేఖర్‌స్వామి, మఠం విజయకుమార స్వామిలు వీరశైవ సమాజం సభ్యులచే ఆరాధనోత్సవాల్లో భాగంగా శ్రీస్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, సుగంధ ద్రవ్యాలతో బసవలింగేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా నమక చమక అధ్యాయాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. బిల్వాష్టకం, శివాష్టకం, అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహించారు. దూప, దీప నైవేద్యాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి వారికి వీరశైవ సమాజం భక్తులు పాదపూజ చేశారు. నిరంజన మఠంలో బసవలింగేశ్వర స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవ ముందు భక్తులు ఖడ్గాలు వేస్తూ స్వామివారిని స్మరించుకున్నారు. పురోహితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తూ ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్‌రెడ్డి శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతులు శ్రీజగద్గురు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామివారు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్‌రెడ్డిని సన్మానించారు. పట్టణంలోని శ్రీమహాదేవుని ఆలయ భజన మండలి సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నియోజకవర్గ అధ్యక్షుడు కొవూరు విజయవర్దన్, సమా జం సభ్యులు బిఆర్ విజయకుమార్, గంతల సంఘమేశ్వర్, బాలప్రకాశ్, తారాపురం రవి, గంటి సర్వేష్, రాకేష్, నాగభూషణం పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరశైవ సమాజం భక్తులు
స్వామివారి సేవలో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి
ఆధ్యాత్మిక చింతన అవసరం
ప్రతిఒక్కరూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం కేటాయించాలని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని శ్రీజగద్గురు నిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీజగద్గురు నిరంజన మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ప్రవచనాలు అందించారు. ప్రతిఒక్కరూ భక్తి, ధ్యానం, భగవత్ చింతన అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. భక్తితో దేన్నైనా సాధించొచ్చన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, ధర్మాన్ని పరిరక్షిస్తూ సమాజ అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు. నిర్మలమైన మనసుతో భగవంతుడిని ఆరాధిస్తే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు