పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలి
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బీస సాయిబాబ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు గురువారం సీఐటీయూ నాయకులతో కలిసి సీడీపీఓ షబానా బేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబ మాట్లాడుతూ.. విద్యారంగంలో మార్పుల పేరుతో కేంద్రం తెచ్చిన పీఎంశ్రీ పథకంతో ఐసీడీఎస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని అన్నారు. మొబైల్ అంగన్‌వాడీ సేవల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని, దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు అందించే సేవలు దూరం అవుతాయని తెలిపారు. పిల్లలు, పేదలకు నష్టం కలగించేలా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారం చేపట్టి పదిహేను నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటా వార్పు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, అంగన్‌వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో అక్రమాలు సహించేది లేదు
షాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనులు సక్రమంగా జరిగేలా చూడాలని డీఆర్‌డీఓ శ్రీలత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ భవనంలో 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులను ఎంపిక చేసుకోవాలన్నారు. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ, వ్యవసాయ పొలాల్లో కాలువలు తవ్వడం, పొలాలను చదును చేయడం, గట్లు పోయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అపర్ణ, ఏపీడీ చరణ్‌గౌతమ్, ఏఈవో కొండయ్య, అంబుడ్స్‌మెన్ సునీతామూర్తి, క్యూసీ సునీత, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ వీరాసింగ్, ఎస్‌ఆర్‌పీ రంజిత్, డీఆర్‌పీలు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిసెంట్లు పాల్గొన్నారు.
గ్రూప్–2లో ప్రతిభ
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రూప్–2 ఫలితాల్లో మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన రాకేష్ సత్తా చాటాడు. రాష్ట్రంలో 177వ ర్యాంకు సాధించాడు. మల్టీజోన్‌లో 78వ ర్యాంకు, ఆరో జోన్‌లో 33వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. రాకేష్ ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం హెచ్‌ఏండీఏలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాకేష్ సోదరి కీర్తన కూడ 2023లో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం సాధించింది. తండ్రి మరణించడంతో తల్లి కూలి పని చేస్తూ పిల్లలను చదివించింది. గ్రూప్–2కు ఎంపికై న రాకేష్‌ను పలువురు అభినందిస్తున్నారు.
తొలి రోజు 15 ఫిర్యాదులు
సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాప్తంగా ఉన్న గుర్తు తెలియని వాహనాలపై సమాచారం ఇవ్వాలంటూ సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ప్రకటించారు. దీనికి సంబంధించి తొలి రోజైన గురువారం పోలీసులకు 15 ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన అధికారులు ఐదు వాహనాలు తొలగించగా.. మిగిలిన వాటిని తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాలపై 90102 03626, 87126 60600 నంబర్లకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని జోయల్ డెవిస్ సూచించారు.
పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలి


