తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం | Sakshi
Sakshi News home page

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం

Published Sat, Nov 11 2023 4:26 AM

నామినేషన్ల ప్రక్రియను పరిశీలిస్తున్న ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ శిల్పశర్మ - Sakshi

కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ

చేవెళ్ల: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నింటిలోనూ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ అభ్యర్థి కేఎస్‌ రత్నం నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. ప్రజాపాలనను గాలికొదిలేసి కుటుంబపాలన సాగించారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌తో ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ అభ్యర్థి కేఎస్‌ రత్నం మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాశ్‌, అంసెబ్లీ కన్వీనర్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి

చేవెళ్ల: ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలని ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌, ఐఏఎస్‌ శిల్పశర్మ అన్నారు. చేవెళ్లలోని ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల తీరును పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయి తదితర వివరాలను రిటర్నింగ్‌ అధికారి సాయిరాంను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆమెకు రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల అధికారులు స్వాగతం పలికారు.

కోడ్‌ ఉల్లంఘించారని ఎన్నికల అధికారుల కొరడా

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులపై అధికారులు కేసులు నమోదు చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి 3వేల మందితో ర్యాలీకి అనుమతి తీసుకొని 20 వేలకు పైగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 5వేల మందికి అనుమతి తీసుకొని 20వేలకు పైగా జనసమీకరణ చేసినందుకు ఎన్నికల అధికారులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు నామినేషన్ల సందర్భంగా గురువారం జరిగిన రాళ్లదాడిపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసిన పోలీసులు దాడిలో పాల్గొన్న వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి శుక్రవారం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 13 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీస్‌లపై దాడి చేశారని ఫిర్యాదు

ఆందోళనను అడ్డుకొని పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించగా పోలీసులపై దాడి చేశారని కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి బీఎల్‌ వర్మ తదితరులు
1/1

ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి బీఎల్‌ వర్మ తదితరులు

Advertisement
 
Advertisement