తొలి ఓటు ఎవరికో! | - | Sakshi
Sakshi News home page

తొలి ఓటు ఎవరికో!

Nov 9 2023 7:14 AM | Updated on Nov 9 2023 7:14 AM

యువ ఓటర్లపై అభ్యర్థుల నజర్‌

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల్లో తొలి ఓటు అత్యంత కీలకం. అందుకే మొదటిసారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్న యువ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి ప్రధాన రాజకీయ పార్టీలు. గ్రేటర్‌లోని చాలా నియోజకవర్గాల్లో తొలి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో కీలకంగా మారాయి. ‘నచ్చితే ఓటేస్తాం.. లేకపోతే నోటాకు సై అంటాం’ అనే యువతరం ధోరణితో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. గతంలో ఎన్నికలు, ఓటు అంటే అంతగా ఇష్టం చూపని యువతరంలో క్రమంగా మార్పు వచ్చింది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించే తత్వం పెరిగింది. ఓటుతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకునే స్థాయిలో వారి ఆలోచనా ధోరణిలో మార్పులొచ్చాయి.

ఉద్యోగాలు, అభివృద్ధే ఎజెండా..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 18– 19 ఏళ్లున్న ఓటర్లు 1.8 లక్షల మంది ఉండగా.. 18– 29 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 17.3 లక్షలు. ఈ యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. సాంకేతికత అందుబాటులో సమస్త సమాచారం అరచేతిలోకి వచ్చేసింది. దీంతో యువ ఓటర్ల సామాజిక ఆలోచనలు మారిపోయాయి. రాజకీయాలు, ఎన్నికలు, అభ్యర్థులు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉంటున్నారు. రాజకీయ పార్టీల విధానాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్నారు. అభ్యర్థుల గుణగణాలను ఉతికి పారేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం, స్కాంలు, అవినీతి వంటి వాటిపై నిర్భయంగా ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి, ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగం కల్పించే పార్టీలకు ఓటు వేస్తామని పేర్కొంటున్నారు.

ఎన్నెన్నో పాట్లు..

యువ ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ యువ ఓటర్లను చేరుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌), ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల వేదికగా చేసుకుంటున్నాయి. షార్ట్‌ వీడియోలు, రీల్స్‌ చేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కేటీఆర్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ వంటి పలువురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాలకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. బస్తీలు, కాలనీల్లోని యువ ఓటర్లను ఆకర్షించేందుకు క్రికెట్‌ కిట్లు, పండగలకు సాంస్కృతిక కార్యక్రమాలు, యువతుల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్మార్ట్‌ వాచ్‌లు వంటివి పంపిణీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement