ఓటు.. చాలా హాటుగురూ!
మొయినాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. పాలకులను ఎన్నకోవడంలో ఎంతో విలువైనది. ప్రస్తుతం అది మరింత ‘విలువైనది’గా మన నాయకులు మార్చేశారు. బంగారం రేటు పెరిగినట్లు ఓటు వ్యాల్యూ సైతం అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు ఓట్లకోసం కల్లు, సారా పంచేవారు. కొంత కాలం క్రితం వరకు మద్యం బాటిళ్లు, ఓటుకు రూ.500 ఇచ్చేవారు. గత ఎన్నికల్లో మందు, బిర్యాని, రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వెచ్చించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పంపిణీ మరింత పెరిగింది. ఓటుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పంపకాలు చేశారు. దీనికి తోడు మద్యం, కూలర్లు, టీవీలు, ఉంగరాలు, ఫ్రిజ్‌లు, కుక్కర్లు, బియ్యం, నూనె డబ్బాలు పంచిపెట్టారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు విలువ ఏకంగా రూ.లక్ష మార్కుకు చేరుకుంది. కొందరు అభ్యర్థులు అంతపెద్ద మొత్తం పంచడం చర్చనీయాంశంగా మారింది.
ఎవరూ తగ్గేదేలే అంటూ..
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం, బిర్యానీ, బియ్యం, సిలిండర్లు, స్టౌలు, కుక్కర్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు, చీరల వంటి వస్తువులతోపాటు అదనంగా డబ్బులు సైతం పంపిణీ చేశారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కాదు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇదే తరహాలో ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటర్లు సైతం ఎవరు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకున్నారు. కొందరైతే మాకెందుకు ఇవ్వరంటూ అడిగి మరీ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే అసలు ఓటు విలువ ఎంత.. ప్రజాస్వామ్యం ఎటు పోతోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పలువురు వాఖ్యానించారు.


