నేడే మున్సిపల్స్
ఓటింగ్‌కు సర్వం సిద్ధం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పుర పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 437 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 126 మంది, బీఆర్‌ఎస్ నుంచి 122, బీజేపీ నుంచి 109 మందితో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 57 మంది ఉన్నారు. మొత్తం 1,76,023 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ కోసం 274 పోలింగ్ కేంద్రాలను సిద్దం చేశారు. 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లను ముద్రించి, ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ విధుల్లో 1,800 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికే వీరంతా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
రూ.కోట్ల కుమ్మరింత
ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులపై వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిఘా వర్గాల కళ్లుగప్పి ఎన్నికల ముందు రోజైన మంగళవారం రాత్రి అభ్యర్థులు మద్యం,నగదును భారీగా పంపిణీ చేశారు. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంకర్‌పల్లిలోని కొన్ని వార్డుల్లో ‘భారీగా’ పంపిణీ చేసినట్టు సమాచారం. ఓటరు స్లిప్పులతో పాటు మద్యం బాటిళ్లు, రూ.కోట్ల నగదు కుమ్మరించారు.
పోలింగ్ జరిగే మున్సిపాలిటీలు : 6
మొత్తం వార్డులు : 126
పోలింగ్ కేంద్రాలు : 274
బరిలో ఉన్న అభ్యర్థులు : 437
మొత్తం ఓటర్లు : 1,76,023
విధుల్లో ఉన్న సిబ్బంది : 1,800
పోలింగ్ సమయం : ఉదయం 7 నుంచి సాయంత్రం 5
నేడే మున్సిపల్స్
నేడే మున్సిపల్స్


