అచ్చం అలాగే.. | - | Sakshi
Sakshi News home page

అచ్చం అలాగే..

Feb 11 2026 8:43 AM | Updated on Feb 11 2026 8:43 AM

అచ్చం అలాగే..

అచ్చం అలాగే..

నగరానికి డిజిటల్‌ ప్రతిరూపం

మహా ప్రణాళికలో సరికొత్త సాంకేతికత

త్వరలో కన్సల్టెన్సీ ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహా నగర సమగ్ర ప్రణాళిక– 2050 రూపకల్పనకు త్రీడీ డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీని వినియోగించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో నగరాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరించవచ్చు. నగరాభివృద్ధికనుగుణంగా పట్టణ ప్రణాళికలు, రహదారులు, మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు అవకాశముంటుంది. త్రీడీ డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీ సాయంతో మహా నగరం మ్యాపింగ్‌ను రూపొందించేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు.

డిజిటల్‌ మ్యాప్‌తో..

డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీ అనేది నిజమైన నగర ప్రతిరూపాన్ని సృష్టించే ఆధునిక సాంకేతిక విధానం. నగరంలోని రహదారులు, భవనాలు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, విద్యుత్‌ నెట్‌వర్క్‌, ట్రాఫిక్‌ పరిస్థితులు వంటి అన్ని అంశాలను డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై త్రీడీ రూపంలో పొందుపరచి, రియల్‌ టైమ్‌ సమాచారంతో అనుసంధానం చేస్తారు. డ్రోన్లు, శాటిలైట్‌ చిత్రాలు, జీఐఎస్‌, ఐఓటీ సెన్సర్లు, కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో డిజిటల్‌ మ్యాప్‌ను రూపొందిస్తారు.

ప్రతి అంగుళాన్నీ వీక్షించే వీలు

● కొత్తగా రూపొందించనున్న మాస్టర్‌ప్లాన్‌ –2050కు అనుగుణంగా త్రీడీ డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనిద్వారా ప్రతి ప్రాంతం వెడల్పు, పొడవు, ఎత్తు లను పరిగణనలోకి తీసుకొని మూడు డైమెన్షన్‌లలో మ్యాపింగ్‌ చేస్తారు. ఇందుకోసం లైడార్‌ ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. ఈ టెక్నాలజీతో ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు నగరంలోని ప్రతి అంగుళాన్ని రియల్‌ టైమ్‌లో ఉన్నది ఉన్నట్లుగా వీక్షింవచ్చు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం, ట్రాఫిక్‌ నియంత్రణ, మౌలిక సదుపాయాలు వంటి సేవలను సత్వరమే అందజేసే అవకాశం ఉంటుంది.

అక్రమ నిర్మాణాలపై నిఘా

డిజిటల్‌ మ్యాపింగ్‌ సహాయంతో అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలను గుర్తించడం సులభమవుతుంది. భవనాల ఎత్తు, విస్తీర్ణం, రోడ్ల ఆక్రమణ వంటి అంశాలు డిజిటల్‌ డేటాతో సరిపోల్చి తక్షణమే చర్యలు తీసుకునే వీలుంటుంది. చక్కటి ప్రణాళికలతో నగరాన్ని నిర్మించేందుకు, విస్తరించేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement