
ర్యాలీలో కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్
షాద్‌నగర్: తెలంగాణలో కొనసాగుతున్న రాచరిక పాలనకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని.. బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. బుధవారం షాద్‌నగర్ బీజేపీ అభ్యర్థి అందెబాబయ్య నామినేషన్ ర్యాలీ అనంతరం పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్ వెనక మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. అన్ని వర్గాల ఆర్థిక పురోభివృద్ధి కోసం ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించి యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందన్నారు. ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్దన్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ టంగుటూరి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్