మీర్‌పేట: మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు
మీర్‌పేట: ఓట్లు వేసి గెలిపించిన, పార్టీని నిలబెట్టిన ప్రజలను నేరుగా కలుసుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మీర్‌పేట కార్పొరేషన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజల సంతోషమే ముఖ్యమని ఎల్లప్పుడూ చెప్పే ముఖ్యమంత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఖరీదైన స్థలాల్లో పేదలకు ఇప్పటివరకు లక్ష వరకు బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలను ప్రభుత్వం అందించనుందని తెలిపారు. దేశంలోనే 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది
కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుందని బీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు, రైతాంగాన్ని చైతన్యం చేయడమే సీఎం లక్ష్యమన్నారు. మీర్‌పేట పార్టీ ప్రధాన కార్యదర్శి జెటావత్ శ్రీనివాస్‌నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జెడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్‌రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలే బలం, బలగం
బడంగ్‌పేట్: నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్‌లోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన బలం, బలగం అంతా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలే అని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తపన పడుతున్నారన్నారు. గతలో కరెంట్‌లేక ఇబ్బందులు చూశాం ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తోంది.. తాగునీటికి కిలోమీటర్లు వెళ్లాం నేడు చిన్న పల్లెటూరుకు కూడా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తున్నామన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, షీటీమ్స్, లెక్కలేనన్ని ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అయ్యారన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దబావి శోభ, భీమిడి స్వప్న, లిక్కి మమత, పి. శ్రీనివాస్‌రెడ్డి, సూర్ణగంటి అర్జున్, సంరెడ్డి స్వప్న, రామిడి కవిత, ముత్యాల లలిత, బొద్రమోని రోహిణి, జెనిగె భారతమ్మ, బోయపల్లి దీపిక, కో ఆప్షన్ సభ్యురాలు గుర్రం ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు
మంత్రి సబితారెడ్డి


