కదిలొచ్చిన కాషాయదండు హోరెత్తిన కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కదిలొచ్చిన కాషాయదండు హోరెత్తిన కరీంనగర్‌

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

ఎస్‌ఐఆర్‌కు మద్దతుగా బీజేపీ మహా పాదయాత్ర

నితిన్‌ నబిన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం

రెండు కిలోమీటర్ల మేర 1.45 గంటలపాటు సాగిన యాత్ర

భారీగా తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు

కరీంనగర్‌: కరీంనగర్‌ నగరంలో బీజేపీ మహా పాదయాత్ర సందడి నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అరలక్ష మందికిపైగా హాజరైనట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గాంధీచౌక్‌ నుంచి వైశ్యభవన్‌, రాజీవ్‌చౌక్‌, టవర్‌ సర్కిల్‌, శాస్త్రి రోడ్డు మీదుగా కమాన్‌ చౌరస్తా వరకు సాగిన పాదయాత్రలో రహదారులన్నీ జనసందోహంతో నిండిపోయాయి. జై శ్రీరాం, జై మోదీ, జై నితిన్‌ నబిన్‌, జై బండి సంజయ్‌ నినాదాలతో నగరం మార్మోగింది.

మూడు రోజుల ముందే ఖరారైనా భారీ స్పందన

కేవలం మూడు రోజుల ముందే పాదయాత్ర షెడ్యూల్‌ ఖరారైనప్పటికీ భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌కు మద్దతుగా మహా పాదయాత్రలు నిర్వహించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్‌ పాదయాత్రకు విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు.

రెండు కిలోమీటర్లు.. 1.45 గంటలు

పాదయాత్రకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసిన నితిన్‌ నబిన్‌ ప్రజలతో మమేకమయ్యారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర 1.45 గంటలపాటు నడిచారు. ఆయనకు అడుగడుగునా కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. పలువురు ఇళ్లు, భవనాలు, వ్యాపార సముదాయాలపైకి ఎక్కి పాదయాత్రను వీక్షించారు. ప్రజల స్పందనతో ఉత్సాహంగా క నిపించిన నితిన్‌ నబిన్‌.. బండి సంజయ్‌ను ఆలింగనం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డప్పు చప్పుళ్లు.. మహిళల ఆటపాటలు

యాత్రలో యువకులు డప్పు చప్పుళ్లతో సందడి చేశారు. జాతీయ, కాషాయ జెండాలు చేతబూని నినాదాలు చేశారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలు, నృత్యాలతో ఉత్సాహం నింపారు.

కాంగ్రెస్‌పై నేతల విమర్శలు

వైశ్యభవన్‌ వద్ద నితిన్‌ నబిన్‌, బండి సంజయ్‌ ప్రసంగించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను కాంగ్రెస్‌ వ్యతిరేకించడంపై విమర్శలు గుప్పించారు. మరణించిన వారి పేర్లు, డబుల్‌ ఓట్లు, దొంగ ఓట్లను తొలగించే ప్రక్రియను కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. అనంతరం కమాన్‌ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ముగించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీ ల్‌ బన్సల్‌, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement