● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: శృంగేరి పీఠాధిపతులు జగద్గురు భారతీ తీర్థ స్వామి, విధుశేఖర భారతి స్వామివారి సూచనలు, ఆదేశాల మేరకే ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సొంత నిర్ణయాలకు తావులేదని స్పష్టం చేశారు. ఆలయ గోపుర తొలగింపుపై వస్తున్న ఆరోపణలపై శుక్రవారం స్పందించారు. ఆలయ ప్రాచీనత, విశిష్టత, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా పనులు చేపడుతున్నామన్నారు. గతంలో శిలామయంగా ఉన్న శిఖరాన్ని 1970వ దశకంలో తొలగించి ఇటుకలతో నిర్మించినట్లు శృంగేరిపీఠంలో చర్చల సందర్భంగా వెల్లడైందన్నారు. తిరిగి శిలామయ శిఖరాన్ని నిర్మించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రధాన ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలోనూ భక్తులు ఇబ్బంది పడకూడదని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. నవంబర్ 11న నూతన శిఖర నిర్మాణానికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం నాలుగో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తులను కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి స్వీకరించారు. ఆర్డీవో కుమారి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్ తోట రాజు, కమిషనర్ లోకేశ్ పాల్గొన్నారు.
బీమా వివరాలు పక్కాగా ఉండాలి : కలెక్టర్
వేములవాడఅర్బన్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలోని దరఖాస్తులో వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. ఎందరు నమోదు చేసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో బీమా వివరాలు నమోదు చేస్తుండగా పరిశీలించారు. వేములవాడ ఆర్డీవో కుమారి, తహసీల్దార్ జయంత్‌కుమార్ ఉన్నారు.
రైతులకు మెరుగైన సౌకర్యాలు
రుద్రంగి: వ్యవసాయ మార్కెట్ యార్డులలో రైతులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.57.85 లక్షలతో నిర్మించే ప్లాట్‌ఫామ్‌ల పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. రైతులకు సహకార సేవలు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గంలో చెక్కపల్లి, రుద్రంగి, కథలాపూర్, మన్నెగూడెంలలో కొత్తగా సింగిల్‌విండోలు మంజూరైనట్లు తెలిపారు. తహసీల్దార్ పుష్పలత, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య పాల్గొన్నారు.


