నేరం చేస్తే తప్పించుకోలేరు ! | - | Sakshi
Sakshi News home page

నేరం చేస్తే తప్పించుకోలేరు !

Nov 17 2026 12:26 AM | Updated on Nov 17 2026 12:26 AM

● 64 కేసుల్లో 93 మందికి శిక్షలు ● ఆరు కేసుల్లో 21 మందికి జీవిత ఖైదు ● జిల్లాలో ప్రత్యేక కోర్టు మానిటరింగ్‌ సిస్టమ్‌ ● ఎస్సై స్థాయి అధికారి, ఆరుగురు సిబ్బంది

జిల్లాలో రెండు కేసుల్లో ఒకే నిందితుడికి శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్‌ సంచలన తీర్పు వెలువరించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికు చెందిన బండపల్లి నవీన్‌ చందుర్తి మండలం మూడపల్లికి చెందిన మైనర్‌ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అప్పటి వేములవాడ డీఎస్పీ వెంకటరమణ నిందితుడిని రిమాండ్‌కి తరలించారు. వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన అదే బాలిక హత్య కేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో అప్పటి వేములవాడ టౌన్‌ సీఐ వెంకటేశ్‌ అదే నిందితుడు బండపల్లి నవీన్‌ను అరెస్ట్‌చేశారు. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. 15 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. శాసీ్త్రయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి రాధికా జైస్వాల్‌ నిందితుడికి పోక్సో కేసులో 20 ఏళ్లు జైలు, రూ.7వేలు జరిమానా, హత్య కేసులో జీవితఖైదుతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

సిరిసిల్ల: నేరం చేసి తప్పించుకు తిరుగుదామనుకునే పరిస్థితులు లేవు. పోలీసుల పకడ్బందీ దర్యాప్తుతో దొంగతనాలు, హత్యలు, హత్యాచారాలు, వే ధింపులు.. నేరం ఏదైనా శిక్ష పడాల్సిందే. ఈ ఏడా ది జనవరి నుంచి నవంబరు 14 వరకు జిల్లాలో 64 కేసుల్లో 93 మందికి జైలుశిక్షలు పడ్డాయి. విచారణలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. శాసీ్త్రయంగా ముందుకెళ్తుండడంతోనే ఇది సాధ్యమవుతుంది.

శిక్షలు ఇలా..

● జిల్లాలో ఆరు కేసుల్లో సమర్థవంతమైన దర్యాప్తుతో 21 మందికి యావజ్జీవ కారాగార(జీవితఖైదు) శిక్షలు పడటం గమనార్హం.

● మరో ఆరు కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు.

● మూడు కేసుల్లో నిందితులకు పదేళ్ల జైలుశిక్ష పడ్డాయి.

● పది కేసులలో మూడు నుంచి ఐదేళ్ల మధ్యలో శిక్ష విధించడం విశేషం.

● మరో 21 కేసుల్లో ఏడాది నుంచి రెండేళ్ల మధ్య జైలుశిక్ష విధించారు.

● 18 కేసుల్లో ఏడాదిలోపు శిక్షలు వేశారు.

ప్రత్యేక మానిటరింగ్‌ విధానం

జిల్లాలో జరిగిన నేరాలను వేగంగా విచారిస్తూ చార్జిషీట్‌ దాఖలు చేయడమే కాదు.. కోర్టులో కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక మానిటరింగ్‌ సిస్టంను ఏర్పాటు చేశారు. కోర్టు కేసులను పర్యవేక్షించేందుకు ఎస్సై స్థాయి అధికారితోపాటు ఆరుగురు పోలీసు సిబ్బందిని నియమించారు. కేసుల విచారణ సందర్భంగా సాక్షులను ప్రవేశపెట్టడం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో సమన్వయం చేస్తూ నిందితులకు శిక్షలు పడేలా ప్రత్యేక మానిటరింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. దీంతో జిల్లాలో నేరం చేసి చట్టం నుంచి తప్పించుకోలేని పరిస్థితులు ఉన్నాయి.

తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మైనర్‌ బాలికను జనగాంకు చెందిన యటెల్లి విజయ్‌ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో అప్పటి తంగళ్లపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టులో 18 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. శాసీ్త్రయ ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు యేటల్లి విజయ్‌కు 20 ఏళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన పిట్టల రాములు, పిట్టల చంద్రమౌళి, పిట్టల తిరుపతి 2018 మే 23న భూవివాదంలో ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనపై కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులు ముగ్గురికి ఇటీవల మూ డేళ్ల కఠిన కారాగార శిక్షను సిరిసిల్ల సెకండ్‌ అడిషనల్‌ న్యాయమూర్తి విధించారు. ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఘటనలో నిందితులకు శిక్ష పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement