వరి వేస్తే ఇబ్బందులు
భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి
యాసంగి పంటల సాగుపై ఆంక్షలు లేవు
కూరగాయల సాగుకు సబ్సిడీ డ్రిప్, స్ప్రింక్లర్లు
‘సాక్షి’తో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం
సిరిసిల్ల: ఒక్క ఎకరం వరి సాగుచేయాలంటే 35 నుంచి 40 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. అదే నీటితో ఆరు ఎకరాల్లో మక్క, పది ఎకరాల్లో జొన్న సాగు చేయొచ్చు. కూరగాయలు అయితే ఆరు ఎకరాల్లో రకరకాల పంటలు పండించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో యాసంగి సాగు ప్రణాళిక.. రైతులు పాటించాల్సిన జాగ్రత్తలను శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. ఆమె మాటల్లోనే...
ఎల్‌నినో పరిస్థితులు జిల్లాలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండడంతో జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వేములవాడ అర్బన్ మండలంలో ఏకంగా 15.39 మీటర్ల లోతుల్లోకి భూగర్భ నీటి మట్టం పడిపోయింది. సిరిసిల్ల మండల పరిధిలో 14.62 మీటర్ల లోతులోకి వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఇప్పుడు నీరున్నా ఫిబ్రవరి, మార్చి నాటికి నీటి లభ్యత తగ్గుతుంది. దాన్ని దృస్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు వేసుకుంటే మంచిది.
మేం ఎంత వద్దన్నా కొందరు రైతులు వరిపంట వేస్తారు. నీరు ఉన్న రైతులు నార్లు పోసుకుంటా రు. తమ ఇంటి పోషణకై నా సన్నవడ్లు పండించుకుంటామంటూ విత్తనాలు కొని, వరి సాగుచేస్తారు. రైతులు తమకు ఇష్టమొచ్చిన పంటలు సాగు చేసుకోవచ్చు. వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు. డిక్లరేషన్ ఇవ్వాలని నిబంధనలూ లేవు. రైతులు దుకాణాల్లో ఏది కొనుగోలు చేసినా బిల్లు పొందాలి. ఎల్‌నినో నేపథ్యంలో మా వ్యవసాయశాఖ వద్ద ఉన్న రైతుల ఫోన్లకు వరి వద్దంటూ మెసేజ్‌లు ఇస్తున్నాం. జిల్లాలోని 1.30 లక్షల మంది రైతులు టెక్ట్స్ మెసేజ్‌లు పంపిస్తున్నాం. ప్రతీ వారం రైతులకు మెసేజ్ ఇస్తూ అప్రమత్తం చేస్తున్నాం. గతేడాది యాసంగిలో 1.90 లక్షల ఎకరాల్లో వరిపంట వేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో 60వేల ఎకరాలకు పరిమితం అవుతుందని అంచనా వేశాం.
జిల్లాలో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కంది, మొక్కజొన్న, సెనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలు సాగు చేసుకోవాలని మా అధికారులు రైతులకు చెబుతున్నారు. రైతులు వారి భూసారాన్ని, భూమి రకాన్ని బట్టి విత్తుకుంటారు. ఆరుతడి పంటల విస్తీర్ణం పెరుగుతుంది. గతం కంటే రెండింతలు ఆరుతడి పంటలు వేస్తారు. మరోవైపు కూరగాయల సాగు ప్రోత్సహిస్తున్నాం. ఆయిల్‌పామ్ వేసుకోవాలని చెబుతున్నారు. గతంలో కంటే రైతుల్లో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన పెరిగింది. జిల్లాలో 3,018 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగైంది. ఈ ఏడాది లక్ష్యం మేరకు మొక్కలు సరఫరా చేస్తున్నారు. ఆయిల్‌పామ్‌తోపాటు అంతరపంటల సాగుతో అదనపు దిగుబడి వస్తుంది. మొక్కలు నాటిన క్షేత్రాల్లో డ్రిప్ ద్వారా నీటి వసతి కల్పిస్తున్నాం.
జిల్లాలో కూరగాయలను సాగు చేసే రైతులకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లను అందిస్తున్నాం. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రతీ మంగళవారం క్షేత్రస్థాయిలో కూరగాయల సాగు పరిశీలిస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలను పండిస్తున్న రైతుల అనుభవాలను తెలుసుకుంటున్నారు. ఆసక్తి గల రైతులకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లను అంది స్తాం. ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో రైతులు కరువు పరిస్థితులను, విద్యుత్ సరఫరా అంచనా వేసుకుంటూ.. ఏ పంటనైనా సాగు చేసుకోవా లి. ఇప్పుడు నీరుందని పంటలు వేసి రేపు ఎండిపోతే బాధపడొద్దు. రైతులు ఆరుతడి పంటలు వేస్తే.. బహుముఖ ప్రయోజనాలు ఉంటాయి. యాసంగి సీజన్‌కు సరిపోయేన్ని విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం.


