● మురికి నీరు.. పచ్చని నాచు ● కలుషితమైన వాగు జలాలు ● దోమలకు ఆవాసం.. రోగాలకు నిలయం
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణాన్ని ఆనుకుని ప్రవహించే మూలవాగు కంపుకొడుతుంది. పట్టణం నుంచి వచ్చే మురికినీరు వాగులోనే చేరుతుండడంతో జలాలు కలుషితమవుతున్నాయి. స్వచ్ఛమైన నీటితో పారాల్సిన మూలవాగులో మురికినీరు ప్రవహిస్తోంది. నాచు పెరిగి, చెత్తాచెదారం నిండి, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. వాగు పరిసరా ల్లోకి వెళ్తే ముక్కుపటాలు అదిరేంత వాసన వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
పర్యావరణానికి ముప్పు.. ప్రజారోగ్యానికి ప్రమాదం
మూలవాగులో మురుగునీరు నిలిచిపోవడం పర్యావరణానికి ఆందోళనకరంగా మారింది. నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుర్వాసనతోపాటు దోమల బెడద పెరిగి పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి జలచరాల మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతుంది. మూలవాగు ప్రక్షాళనపై శ్రద్ధ పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


