నేటి నుంచి సాయంత్రం స్పెషల్ క్లాసులు
డిసెంబర్ 31 వరకు సిలబస్ పునఃశ్చరణ
మెరుగైన ఫలితాలే లక్ష్యం
గంభీరావుపేట(సిరిసిల్ల): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి డిసెంబర్ 31 వరకు రోజూ సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2027 మార్చి–ఏప్రిల్‌లో జరగనున్న ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సిలబస్ పునఃశ్చరణ చేయనున్నారు. జిల్లాలో 111 జెడ్పీ, 7 మోడల్, 13 కేజీబీవీ, 30 గురుకుల పాఠశాలలున్నాయి.
వరండాలో వద్దు..
ప్రత్యేక తరగతులు సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతను ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ సూచించింది. పదో తరగతి విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని ఆదేశించింది. విద్యార్థులను తరగతి గదుల బయట వరండాల్లో కూర్చోబెట్టకుండా గదుల్లోనే బోధన అందించాలని స్పష్టం చేసింది.
ప్రతీ యూనిట్‌పై పరీక్షలు
సిలబస్‌లోని ప్రతి అధ్యాయం, యూనిట్ పూర్తయి న వెంటనే స్లిప్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని బట్టి బోధనలో తగిన మార్పులు చేయాలని, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ, బోధన తీరును పరిశీలించేందుకు జిల్లా అధికారులు పాఠశాలలను సందర్శించే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపా ల్స్ విద్యాశాఖ ఆదేశాలు అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, పరీక్షలకు ముందుగానే సిలబస్ పున ఃశ్చరణ పూర్తి చేసి, అభ్యాస పరీక్షల ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించనున్నారు.


