యాసంగి బెంగ ! | - | Sakshi
Sakshi News home page

యాసంగి బెంగ !

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

ఎగువ మానేరులో 1.9 టీఎంసీల నీరు

తాగు అవసరాలకే అంటున్న ప్రభుత్వం

ఆయకట్టు సాగుపై రైతుల్లో సందిగ్ధం

ముస్తాబాద్‌: యాసంగి సాగుపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావంతో నీటిని సంరక్షించుకోవాలని చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఎగువ మానేరు ప్రాజెక్టు ఆయకట్టు సాగు సందిగ్ధంలో పడింది. జిల్లాకు ప్రాణధారమైన నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుపైనే మూడు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. వానాకాలం పంటలకు వర్షాలు సహకరించి గట్టెక్కామని.. రాబోయే యాసంగికి ప్రాజెక్టు నీరు వస్తుందా? లేదా? అనే ఆలోచనలో పడ్డారు. తాగునీటి అవసరాలకే నీరు ఉపయోగించాలన్న ప్రభుత్వం ఆలోచనతో ఈసారి సాగు కష్టమనే చర్చ సాగుతోంది. ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల పరిధిలో 15వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

ఆందోళన కలిగిస్తున్న ఎల్‌నినో

ఇప్పటికే ఎల్‌నినో ఎఫెక్టుతో సరైన వర్షాలు కురువలేదు. కామారెడ్డి జిల్లాలో కురిసిన వానలతో ఎగువమానేరు ప్రాజెక్టులోని వరద వచ్చి చేరడంతో నిండింది. ప్రస్తుతం 1.7 టీఎంసీల నీరు ఉంది. యాసంగి సాగు మరో పక్షం రోజుల్లో మొదలుకానుంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో చెరువులు, రిజర్వాయర్లలోని నీటిని వ్యవసాయానికి విడుదల చేయబోమని, తాగునీటి అవసరాలకే వినియోగించాలనే ప్రభుత్వం సూచిస్తుంది. ఇదిలా ఉండగా 2010లోనే ఎగువ మానేరులో 68 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మించి కోళ్లమద్దిలో రిజర్వాయర్లను నిర్మించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో మొత్తం నీటిని సాగుకు కాకుండా తాగునీటికి వాడాలనేది అధికారుల ముందస్తు హెచ్చరికతో రైతులు ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మండుతున్న ఎండలతో జలాశయాల్లో నీరు ఆవిరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ఎఫెక్టు ఉంటుందన్న అంచనాలతో ఆ తరువాత వచ్చే ఎండకాలంతో నీటికష్టాలు మరింత మొదలవుతాయనే అధికారులు అంచనా వేస్తున్నారు. భూగర్భ జలాలు అలాగే ఉండాలంటే మానేరులో నీటిని కాపాడుకోవాలన్న ముందుచూపులో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు కుడికాలువ కింద ఉన్న 10వేల ఎకరాలకు నీరందించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తైబందీ నాటికి నిర్ణయం

మానేరు ప్రాజెక్టు ఆయకట్టు తైబందీకి ఇంకా సమయం ఉందని నీటి పారుదలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. యాసంగి సాగుకు ఆయకట్టును నిర్ణయించే తైబందీ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ రైతులు వరి సాగుచేస్తే పూర్తిస్థాయి నీరు ఇవ్వలేమని నీటిపారుదల, వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకరకంగా క్రాఫ్‌ హాలిడే బెటర్‌ అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు, కూరగాయల సాగుచేయాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్టుపై వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఎల్‌నినోను ఎలా ఎదుర్కోవాలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందున.. ముందస్తుగా వరి విత్తనాలు, ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచడం లేదని తెలిసింది. ఒకరకంగా కరువు పరిస్థితులు వస్తాయని రైతులను అధికారులు హెచ్చరిస్తున్నారు. పశువులకు పశుగ్రాసం కూడా కరువయ్యే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆరుతడిపంటల సాగే మేలని చెబుతున్నారు.

వ్యవసాయశాఖ

అధికారుల అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement