మల్యాల/ధర్మపురి: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి, ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు శనివారం కుటుంబసమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. జిల్లా జడ్జి రత్నాపద్మావతి, సబ్ జడ్జి నాగేశ్వర్‌రావు, ధర్మపురి కోర్టు మేజిస్ట్రేట్ యోగి జానకి, తహసీల్దార్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ అలువాలు శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య
జూలపల్లి: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన గీతకార్మికుడు బందారపు సురేశ్(34) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మల్లేశ్ కథనం ప్రకారం.. గీత కార్మికుడు సురేశ్.. ఉపాధి కోసం అప్పు చేసి కొన్నేళ్ల క్రితం ఖతార్ దేశం వెళ్లాడు. రెండు సంవత్సరాలకే తిరిగి వచ్చాడు. ఖతార్ వెళ్లే సమయంలో చేసిన అప్పులు సుమారు రూ.7లక్షలు తీర్చేదారిలేక మానసికంగా కుంగిపోయాడు. ఈ విషయాన్ని భార్యకు చెబుతూ బాధపడేవాడు. బతుకమ్మ పండుగ కోసం భార్య రమాదేవి, కొడుకుతో కలిసి తన పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. ఈనెల 23న రాత్రి భార్యకు ఫోన్‌చేసి తాను పురుగుల మందు తాగానని చెప్పాడు. ఆమె వెంటనే స్పందించి సురేశ్ సోదరుడు బందారపు అంజయ్యకు ఫోన్ ద్వారా విషయం చెప్పింది. ఆ తర్వాత సురేశ్‌ను కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
మెడికల్ షాప్ యజమాని..
కరీంనగర్‌క్రైం: మెడికల్ షాప్‌లో వ్యాపారం సరిగా సాగక నష్టాలు రావడంతో మానసిక ఆందోళనకు గురైన ఓ వ్యక్తి వివిధ రకాల మందులు మింగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌లోని చైతన్యపురికి చెందిన నడిమెట్ల శ్రీరాములు (34) భగత్‌నగర్‌లోని రామచంద్రాపూర్‌కాలనీలో సాధన మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా వ్యాపారం సరిగా సాగక నష్టాలు వస్తుండగా, అప్పులు కూడా పుట్టడం లేదని కుటుంబ సభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 23న సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన శ్రీరాములు షాప్‌లోని వివిధ రకాల టాబ్లెట్లు మింగినట్లు భార్యకు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.
గుండెపోటుతో ముగ్గురు మృతి
వేములవాడరూరల్/రామగుండం/రుద్రంగి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం ముగ్గురు యువకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లికి చెందిన సింగారపు బాబు, కమల దంపతుల కొడుకు సింగారపు శేఖర్(30) గల్ఫ్ వెళ్లాడు. అనారోగ్యానికి గురికావడంతో నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. వైద్యులు పరీక్షించి గుండె వాల్వ్‌లో స్టంట్ వేశారు. శనివారం ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తల్లి కాళ్లపై కుప్పకూలిపోయాడు. శేఖర్ చిన్నవయసులోనే తండ్రి బాబు చనిపోయాడు. మృతునికి తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కోల భూమారెడ్డి శనివారం గుండెపోటుతో మరణించాడు.
హౌసింగ్‌బోర్డు కాలనీలో..
రామగుండం పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఎర్రం అంజయ్య–ఎల్లమ్మ దంపతులకు సందీప్(27), మణికంఠ సంతానం. సందీప్ కూలి పనులు చేస్తుండగా, మణికంఠ ఎన్టీపీసీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సందీప్ ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించగా గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందాడు. అయితే హౌసింగ్‌బోర్డు కాలనీలో ఒకే రోజు ప్రమాదంలో ఇద్దరు, గుండెపోటుతో మరో యువకుడు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.


