తీరొక్క పూలు.. ఊరుకో తీరు ! | - | Sakshi
Sakshi News home page

తీరొక్క పూలు.. ఊరుకో తీరు !

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

● మారుమోగుతున్న జానపదాలు ● కాలు కదుపుతున్న ఆడపడచులు ● ఎములాడలో ఏడొద్దులు.. మిగతా ప్రాంతంలో తొమ్మిది రోజులకు.. ● దసరా తరువాత రుద్రంగిలో సద్దుల సంబురం

● మారుమోగుతున్న జానపదాలు ● కాలు కదుపుతున్న ఆడపడచులు ● ఎములాడలో ఏడొద్దులు.. మిగతా ప్రాంతంలో తొమ్మిది రోజులకు.. ● దసరా తరువాత రుద్రంగిలో సద్దుల సంబురం

సిరిసిల్ల: ఏ గల్లీకి పోయిన బతుకమ్మ పాటలు మారుమోగుతున్నాయి. తెలంగాణ ఆడపడచులు పండుగ అయిన బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత శనివారం పితృఅమావాస్యతో మొదలైన బతుకమ్మ వేడుకలు జిల్లాలో మూడు ప్రాంతాల్లో మూడు తీర్లుగా జరుపుకుంటారు. బతుకమ్మ పూలు రంగురంగులుగా ఉన్నట్లు జిల్లాలోనూ వివిధ రకాలు సద్దుల బతుకమ్మ నిర్వహించుకుంటారు. దక్షిణకాశీ.. వేములవాడలో ఏడు రోజులకు.. సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు మిగతా అన్ని గ్రామాల్లో తొమ్మిది రోజులకు.. రుద్రంగి మండల కేంద్రంలో దసరా తర్వాత సద్దుల బతుకమ్మ నిర్వహిస్తుంటారు. ఊరుకో తీరుగా.. తీరొక్క పూలతో సాగే పాటల జాతర బతుకమ్మ పండుగ విశిష్టతలపై ప్రత్యేక కథనం.

తీరొక్క పూల జాతర

పల్లెల్లో తొమ్మిది రోజులపాటు బతుకమ్మ నిర్వహిస్తారు. పితృ అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చి ఆ రోజు కొందరు, ఆ మరునాడు కొందరు రోజుకో పేరుతో.. రోజుకో సద్దితో ఎనిమిది రోజులు బొడ్డెమ్మగా జరుపుకొని తొమ్మిది రోజుల నాడు పెద్దబతుకమ్మ, సద్దుల బతుకమ్మగా సాగనంపుతారు. పండుగ విధానం కూడా వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా ఉంటుంది. పొద్దంతా పనిచేసి సాయంత్రం వచ్చేముందు అడవిలోని రకరకాల పూలు తెచ్చి సిబ్బిలో గుండ్రంగా పిరమిడ్‌ ఆకారంలో పేర్చి పసుపు ముద్ద, గుమ్మడిపూల గౌరమ్మను చేసి మధ్యలో ఉంచి చుట్టూ తిరిగి చప్పట్లు కొడుతూ ఆడతారు. పండుగ వర్షాకాలం చివరన, శీతాకాలం మొదట వస్తుంది కాబట్టి భూమి నిండా పచ్చదనం, చెట్లనిండా పూలు ఉంటాయి. వాగులు, వంకలు పారుతుంటాయి. ప్రతీ పువ్వు బతుకమ్మకు అలంకారమే. సద్దుల బతుకమ్మనాడు ఊరంతా పూలజాతరగా మారుతుంది.

కమ్మనైన అమ్మపాట... బతుకమ్మ

ఉత్తేజాన్ని సామాజిక చరిత్రను, ఇతిహాసాలను, అన్నచెల్లెల్ల అనుబంధాన్ని పాటల రూపంలో చెబుతారు. పాటంటే తెలంగాణ ఎత, కథ తలపోత. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వచ్చినట్లు.. కష్టమైనా.. సుఖమైనా.. పంట పండినా.. బతుకు ఎండినా.. తెలంగాణలో అది పాటగా మారుతుంది. పూర్వకాలంలో తెలంగాణలో సీ్త్రలు దొరలు, భూస్వాములు, వతన్‌దార్ల కింద అష్టకష్టాలు పడేవారు. వాళ్ల కష్టాలను పాటల రూపంలో చెప్పుకోవడానికి ఈ పండుగ వేదికై ంది. ఆచారం, సంస్కృతి, అలవాట్లు కూడా ఒక తరం నుంచి మరో తరానికి అందించే వేదిక బతుకమ్మ. సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపేరోజు తీసుకెళ్లే పలహారాలు కాయ, పండ్లు, పిండిధాన్యాలే. ఈ పండుగ కాలం నాటికి పునాసపంటలు అంటే మక్కలు, జొన్నలు, బబ్బెర్లు, పెసర్లు, పల్లీలు, మినుములు ఇంట్లోకి వస్తాయి. అవే నైవేద్యంగా పెట్టి తినడం ఆచారమైంది. మనిషికి తిండి రూపంలో అందే ఒక వైవిధ్యమైన పండుగగా బతుకమ్మను చెప్పవచ్చు. అందరిని కలిపే ఈ పండుగ ఆత్మీయతను పెంపొందించేది. ఏ పండుగకు ఎలా ఉన్నా ఈ పండక్కి మాత్రం ఆడబిడ్డల చూపు తల్లిగారింటి వైపు ఉంటుంది. ఇంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండక్కి ఓ గుడిలేదు.. స్త్రోత్రం లేదు.. శ్లోకం అంతకంటే లేదు. కష్టాలే పాటలు.. దొరికిన పూలే రూపాలు.. ఇంట్లోని ధాన్యాలే నైవేద్యాలు. మరో విశేషమేంటంటే ప్రతి దేవున్ని మనిషి ఏవేవో కోర్కెలు కోరుకుంటాడు.. కానీ, బతుకమ్మను ఏ కోరిక కోరడు. బతుకమ్మను తన బతుక్కి ప్రతిరూపంగా తప్పా దేవతారూపంగా ఎవరూ చూడరు. ఇంతటి విశిష్టతను కలిగిన బతుకమ్మ పండగా... ఇంటింటా సందడిని నింపింది. దసరా పండుగ సెలవులతో పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగా.. దసరాకు ముందు జరిగే బతుకమ్మ పండుగ ప్రత్యేకతను చాటుకుంటుంది. అదే రుద్రంగి మండల కేంద్రంలో దసరా పండుగ తరువాత సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. సిరిసిల్లతోపాటు అన్ని ప్రాంతాల్లోనూ నవరాత్రులతో సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఇలా ఊరుకో తీరుగా.. ప్రాంతానికో విధంగా పూల పండుగ నిర్వహిస్తారు.

తంగేడు, గుమ్మడి పూలే ప్రధానం

బతుకమ్మకు ప్రతీక అనగానే తంగేడు, గుమ్మడిపూలు గుర్తుకొస్తాయి. గుమ్మడిని గౌరమ్మగా నిలిపితే, తంగేడును బతుకమ్మగా పేరుస్తారు. తంగేడు చెట్టూ తెలంగాణ పల్లెప్రజల జీవన విధానం పోలి ఉంటుంది. నీలు లేని చెలకలో గుట్టల మీద, రాళ్ల నడుమ గాలికి.. ఎండకు తట్టుకుని నిలిచి తలెత్తుకునే కష్టజీవి తంగేడు. తెంపిన చాలా సేపటి వరకు వాడిపోని, కాంతివిహీనం కాని దివ్య ఔషధం. అందుకే ఇది బతుకమ్మలో ప్రధానమైంది. ఊరి శివారుల్లోని చెలకలు, గుడ్డాలు, అటవీ భూమల్లో తంగేడు, గునుగు, గుమ్మడిపూలు విరివిగా లభిస్తాయి.

‘రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..’

‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో బిడ్డలనీయవే ఉయ్యాలో..’

‘చిత్తూ.. చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన..’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement