తంగళ్లపల్లి: ఐటీఐలలో ఐదో విడత (వాక్–ఇన్) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్ర భుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్.కవిత బుధవా రం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీలలో ప్రవేశాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేరుగా హాజరుకావాలని తెలిపారు.
‘ప్రభుత్వ భూమిని కాపాడాలి’
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. ఈమేరకు బుధవారం సిరిసిల్ల ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీస్‌ల ఎదుట నిరసన తెలిపి మాట్లాడారు. పట్టణంలోని సర్వే నంబర్ 1581లోని 2.10 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంతో రూ.50కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణదారుల పాలువుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శిగా నిర్మల
ఎల్లారెడ్డిపేట: మండలంలోని కిష్టునాయక్‌తండా సర్పంచ్ నిర్మలను బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి బుధవారం నియామకపత్రాలు అందజేశారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు కిరణ్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు రామచంద్రరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
మత్స్యకారులకు శిక్షణ
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో మత్స్యకారులు, రైతులకు ఇస్తున్న శిక్షణ బుధవారం రెండో రోజుకు చేరింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్నసిరిసిల్ల, నాగర్‌కర్నూల్ జిల్లాల మత్స్యకారులు శిక్షణకు హాజరయ్యారు. వీరికి కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, కార్తీక్, దివ్య దేశవాళీ కార్ప్ చేప పిల్లల ఉత్పత్తి, యాజమాన్య పద్ధతులు వివరించారు. చేపల చెరువుల తయారీ, నీటి నాణ్యత గుర్తింపుపై అవగాహన కల్పించారు.


